కె.విశ్వనాథ్ వయోభారంతో ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. బయట ఎక్కడా కనిపించడం లేదు. సినిమా పరిశ్రమకు దూరమయ్యారే తప్ప.. సినిమాలకు కాదు. ఆయన కాలక్షేపం సినిమాలు చూడడమే. ఈమధ్య ఆయన `ఆర్.ఆర్.ఆర్` చూశార్ట. అందులోని ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయారట. ముఖ్యంగా `కొమరం భీముడా` పాట విశ్వనాథ్ కి తెగ నచ్చేసిందని, ఈ పాట చూసి ఆయన కూడా ఎమోషన్ అయిపోయారని తెలుస్తోంది. ఈ విషయాన్ని వెంటనే ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి మరీ చెప్పార్ట. కె.విశ్వనాథ్ దగ్గర్నుంచి అభినందన రావడం ఓ అవార్డుతో సమానం. ఎన్టీఆర్‌కి కూడా విశ్వనాథ్ సినిమాలంటే చాలా ఇష్టం. `నాకు సాగర సంగమం లాంటి సినిమా చేయాలని ఉంది.. దాన్ని విశ్వనాథ్ గారు మాత్రమే తీయగలరు..` అని ఎన్టీఆర్ వచ్చిన కొత్తలో చెప్పేవాడు. ఇప్పుడు ఈ కలయికకు అవకాశం లేదు.కాకపోతే.. విశ్వనాథ్ దృష్టిలో మాత్రం ఎన్టీఆర్ పడ్డాడు. అది చాలు. `ఆర్.ఆర్.ఆర్`లో చరణ్‌తో పోలిస్తే ఎన్టీఆర్ పాత్ర నిడివి, దాని ప్రాధాన్యం తగ్గిందని బాధ పడుతున్న ఎన్టీఆర్ అభిమానులకు ఇలాంటి ప్రశంసలు ఊరట కలిగిస్తున్నాయి.