KA Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్-
ఎలాంటి కథ చెబుతున్నాం అనేది ఎంత ముఖ్యమో, కథని ఎలా చెబుతున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. కొత్త కథల్ని రెగ్యులర్ పేట్రన్‌లో చెబితే నచ్చకపోవొచ్చు. రెగ్యులర్ కథల్ని కొత్తగా ఆవిష్కరిస్తే – అదే జనాలకు నచ్చొచ్చు. ఓ మామూలు కథ.. క్లైమాక్స్‌కి వచ్చే సరికి, పూర్తిగా కొత్త రంగులు సంతరించుకోవొచ్చు. దాని స్వరూపమే మారిపోవొచ్చు. ‘క’ సినిమా పూర్తయ్యాక అదే ఫీలింగ్ కలుగుతుంది. ఈ కథ ముగింపు చాలా కొత్తగా అనిపిస్తుంది. అందులో బోలెడంత మెటాఫర్ కనిపిస్తుంది. ‘ఓహో… దర్శకుడు ఇలా ఆలోచించాడా’ అని ముచ్చటేస్తుంది. అప్పటి వరకూ కొన్ని తప్పులూ, ఇంకొన్ని ఫిర్యాదులూ కనిపించినా, క్లైమాక్స్ తో అవన్నీ మాయం అయిపోతాయి. అసలు కథేమిటో చెప్పకుండా నేరుగా క్లైమాక్స్లోకి వెళ్లిపోవడం ఎందుకూ అంటారా? అసలు ఈ కథే క్లైమాక్స్ తో మొదలవుతుంది గనుక. ‘ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే ఇక సినిమాలే మానేస్తా’ అంటూ యువ హీరో కిరణ్ అబ్బవరం చాలా ధైర్యంగా స్టేట్మెంట్ విసిరే సరికి, ‘అంత కొత్తగా ఇందులో ఏముంది’ అనే ఆసక్తి నెలకొంది. ‘క’ అనే ఏకాక్షరి టైటిల్, టీజర్, ట్రైలర్ మరింత ఆసక్తి పెంచాయి. మరి ‘క’లో అంతగా రక్తికట్టించిన కథేముంది?
అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాథ. చిన్నప్పుడు ఓసారి యాదృచ్ఛికంగా ఎవరికో వచ్చిన ఉత్తరాన్ని చదువుతాడు. అప్పటి నుంచీ పక్కవాళ్ల ఉత్తరాలు చదవడం ఓ అలవాటుగా మారిపోతుంది. ఆ ఉత్తరాల్లోనే అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లమ్మల్ని వెదుక్కొంటుంటాడు. పెరిగి పెద్దవాడై, కృష్ణగిరి అనే ఓ మారు మూల పల్లెటూరిలో అసిస్టెంట్ పోస్ట్‌మెన్‌గా ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ ఊరు, అక్కడి మనుషులకు వాసుదేవ్ కనెక్ట్ అయిపోతాడు. అయితే ఉత్తరాలు చదివే అలవాటు మాత్రం మానుకోడు. ఆ ఊరిలో అనుకోకుండా అమ్మాయిలు మాయం అవుతుంటారు. దాని వెనుక ఉన్న మిస్టరీని ఆ ఉత్తరాల ద్వారానే ఛేదిస్తాడు వాసుదేవ్. అదెలా జరిగింది? ఈ అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారు? వాళ్లని పట్టుకొనే క్రమంలో వాసుదేవ్ కు తెలిసిన నిజాలేమిటి? అనేదే క కథ.
కథ క్లుప్తంగా చెబితే, పోస్ట్‌మెన్ ఆ ఊరి ఉత్తరాలు చదవడం మినహా కొత్తగా ఏం అనిపించకపోవొచ్చు. కానీ దర్శకులు ఈ కథని డీల్ చేసిన విధానం, వేసిన ముడులు, వాటిని విప్పిన పద్ధతిలో కొత్తదనం కనిపిస్తుంది. వాసుదేవ్‌ని ముగ్గురు ముసుగు మనుషులు ఓ చీకటి గదిలో బంధిస్తారు. అతని ముందు ఓ కాలయంత్రం లాంటిది పెట్టి, వాసుదేవ్ జీవితంలో ఏం జరిగింది? అనే విషయాన్ని వాసుదేవ్ తోనే చెప్పిస్తారు. అవన్నీ ఎపిసోడ్ ఎపిసోడ్లుగా తెరపైకి తీసుకొచ్చారు. తొలి సీన్ నుంచే ఓ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అయితే.. వాసుదేవ్ బాల్యం, తన అలవాట్లు, పోస్ట్ మెన్ గా కృష్ణగిరికి రావడం ఈ సన్నివేశాలన్నీ సాదాసీదాగా అనిపిస్తాయి. కృష్ణగిరి నేపథ్యం కాస్త ఆసక్తిని కలిగిస్తుంది. అక్కడ మధ్యాహ్నం మూడింటికే చీకటి పడిపోవడం, అమ్మాయిలు మాయం అవ్వడం, ఎవరూ లేని ఇంటికి ఉత్తరాలు రావడం.. ఇవన్నీ ప్రేక్షకుడ్ని కథలోకి తీసుకెళ్తాయి. ఊరిలో ఓ పాత్రపై ప్రేక్షకుడికి కాస్త అనుమానం మొదలవుతుంది. దాన్ని ఇంట్రవెల్ బ్యాంగ్ గా మారిస్తే.. సినిమా అక్కడే చచ్చిపోయేది. కానీ ప్రేక్షకులు ఊహించని ఓ ట్విస్ట్ ఇచ్చి విశ్రాంతి కార్డు వేశారు దర్శకులు.
ద్వితీయార్థం కథలో కాస్త వేగం వస్తుంది. ఉత్తరాలు చదివే అలవాటునే ఆసరాగా చేసుకొని, హీరో తప్పులో కాలేయడం, ఒకర్ని కాపాడుకోవాలనుకోవడం, అక్కడ జరిగే ఘర్షణ, ఆ ఎపిసోడ్ కి చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఇవన్నీ కాస్త ఉత్కంఠ భరితంగా సాగాయి. అమ్మాయిల మిస్సింగ్ కేసులో దొంగ దొరికేశాడు అనుకొన్న తరుణంలో ఇచ్చిన మలుపు.. మరీ థ్రిల్లింగ్ గా ఏం అనిపించదు. కేవలం ఎక్స్‌టెన్షన్‌గా ఉంటుందంతే. క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో తెలిశాక కూడా కొన్ని ప్రశ్నలు మిగిలిపోతాయి. వాటికి దర్శకుడు ఎలాంటి సమాధానం చెబుతాడా? అనే ఆసక్తి నెలకొంటుంది. ‘క’ అనే పదానికి అర్థం చెప్పడమే కాకుండా, అసలు చీకటి గదిలో ఇంత ఇన్వెస్టిగేషన్ జరపడానికి గల కారణం చివరి నిమిషంలో రివీల్ అవుతుంది. అప్పుడు మాత్రం కచ్చితంగా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఎప్పుడైతే అసలు విషయం తెలిసిపోయిందో, అప్పుడు పాత డైలాగులు, సీన్లు ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. దర్శకుడు ఆ డైలాగ్‌ని అప్పుడు ఎందుకు వాడాడో తెలిశాక, ‘క’ క్లైమాక్స్ పై మరింత గౌరవం కలుగుతుంది. ఇంత మెటాఫర్ అందరికీ అర్థం అవుతుందా? అని అనిపించొచ్చు. అర్థం కానివాళ్లకు విడమర్చి చెప్పలేం. కానీ… అర్థమైతే మాత్రం క్లైమాక్స్ తోనే టికెట్ రేటు గిట్టుబాటు అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ వినిపించిన డైలాగులు, ప్రతీ పాత్రనీ ముగించిన తీరు నచ్చుతాయి. కానీ అక్కడక్కడ స్లో ఫేజ్ ఇబ్బంది పెడుతుంది. హై మూమెంట్స్ లేవు. ఇంట్రవెల్ బ్యాంగ్ లో ఇచ్చిన ట్విస్ట్ బాగున్నా, ‘వావ్’ ఫ్యాక్టర్ రాలేదు. కాకపోతే క్లైమాక్స్ ఓపెన్ అయ్యాక, ఇంట్రవెల్ బ్యాంగ్ కు ఓ సార్థకత చేకూరుతుంది.
కిరణ్ అబ్బవరం చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా ఇది. అదంతా తెరపై కనిపిస్తోంది. వాసుదేవ్ పాత్రలో ఇమిడిపోయాడు. యాక్షన్ సీన్లు కూడా సహజంగా చేశాడు. తనపై చాలా చోట్ల సింపతీ కలుగుతుంది. అది ఈ పాత్రకు చాలా అవసరం కూడా. ఇద్దరు కథానాయికలు ఉన్నారు. సత్యభామ పాత్రలో నయని సారిక అందంగా కుదిరిపోయింది. పెర్ఫార్మెన్స్కు పెద్ద స్కోప్ లేదు. రాధ పాత్ర చాలా కీలకం. క్లైమాక్స్ లో ఆ పాత్ర ప్రాధాన్యత మరింత అర్థం అవుతుంది. సినిమా మొత్తం… కిరణ్ కనిపిస్తూనే ఉంటాడు. మిగిలిన పాత్రలతో పోలిస్తే తనదే డామినేషన్. సుబ్బు పాత్రలో తమిళ నటుడ్ని తీసుకొచ్చారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ ప్రయత్నం చేశారేమో. తెలుగు నటుడైతే.. మరింత కనెక్టివిటీ ఉండేది.
టెక్నికల్ గా ఈ సినిమా మంచి స్థాయిలో ఉంది. కెమెరా వర్క్, నేపథ్య సంగీతం చక్కగా కుదిరాయి. కృష్ణగిరి అనే ఊరుని చాలా అందంగా చూపించారు. 1977 ప్రాంతంలో జరిగే కథ ఇది. అప్పటి వాతావరణం మళ్లీ పునః సృష్టించడానికి ఆర్ట్ విభాగం బాగా సహకరించింది. ‘జాతర’ పాట బాగుంది. అయితే టైమింగ్ సరిగా కుదర్లేదు అనిపించింది. యాక్షన్ ఎపిసోడ్లని సహజంగా తెరకెక్కించారు. మామూలుగా రాస్తే రెగ్యులర్ కథే ఇది. దాన్ని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. సినిమాలో కాస్త లాగ్, కాస్త బోరింగ్ కనిపించినా, క్లైమాక్స్ కి వచ్చేసరికి ‘కొత్త సినిమా చూశాం’ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. రెగ్యులర్ సినిమా అయితే కాదు. టీమ్ మొత్తం ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ప్రయత్నించింది. ఆ ప్రయత్నం కొంతమేర ఫలించింది కూడా. కమర్షియల్ గా ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి మరి.
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్-