పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అంశాన్ని పవన్ కల్యాణ్‌కు ముడిపెట్టాలని కేఏ పాల్ ప్రయత్నిస్తున్నారు. అసలు ఎలాంటి లింక్ లేకపోయినా ఆయన పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఇదంతా జరిగిందని ఆరోపిస్తున్నారు. అసలు పాస్టర్ ప్రవీణ్ ప్రాథమికంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తేల్చారు. పాస్టర్ల సంఘాలు, క్రైస్తవులు డిమాండ్ చేయడంతో కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానాస్పద సమాచారం రాలేదు.
కానీ దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేయడంతో సీఎం చంద్రబాబు వెంటనే విచారణకు ఆదేశించారు. పోలీసులు ఏవైనా ఆధారాలు ఉంటే ఇవ్వొచ్చని ప్రజలకు ఆరోపణలు చేస్తున్న వారికి పిలుపునిచ్చారు. అయితే పాస్టర్ ను చంపేశారని ఆరోపిస్తున్న వారు ఎవరూ.. ఫలానా వాళ్లు చంపేసి ఉంటారని చెప్పలేకపోతున్నారు. పాస్టర్ ప్రవీణ్ కు ఎవరితోనూ చంపుకునేంత శత్రుత్వం ఉందని అనుకోవడం లేదు. అసలు ఆయన ఏపీలో పెద్దగా ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోరు. హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
మరి ఇందులో పవన్ కల్యాణ్ ప్రస్తావన ఎందుకు వస్తుందో కానీ పదే పదే పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు కేఏ పాల్. రాజకీయంగా చేసే ఆరోపణలు వేరు.. ఇలాంటి మత పరమైన సున్నితమైన విషయాల్లో ఆరోపణలు వేరు. గోదావరి జిల్లాల్లో ఉండే సున్నితమైన సామాజిక వ్యవహారాల కారణంగా కేఏ పాల్ ఆరోపణలు పవన్ ఇమేజ్ పై మరకలు వేస్తాయి. పవన్ పై రాజకీయంగా కోపం ఉంటే .. విమర్శలు చేసుకోవచ్చు కానీ.. ఇలా మత పరమైన అంశాల్లో ఆయనకు సంబంధం లేకపోయినా ఇరికించి ఏదో చేయాలనుకోవడం రాజకీయంగా మంచిది కాదన్న వాదన వినిపిస్తోంది.