తెలంగాణలో రాజకీయానికి కేఏ పాల్ విరామం ప్రకటించినట్లుగా ఉన్నారు. అమెరికా నుంచి రావడంతోనే హైదరాబాద్‌లో పెద్ద ఆఫీస్ ప్రారంభించి యాత్రలతో హడావుడి చేసిన ఆయన ఇప్పుడు హఠాత్తుగా ఏపీపై దృష్టి పెట్టారు. అమరవీరుల కుటుంబాలను పార్టీలో చేర్చుకుని రాజకీయం చేయడంతో ఆయనకు కొంత ప్రతిఘటన తెలంగాణలో ఎదురయింది. కొన్ని కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వంపై సీబీఐ చీఫ్‌కు కూడా ఫిర్యాదు చేసి కలకలం రేపారు. బీజేపీ మద్దతుతోనే టీఆర్ఎస్కు ఆయన చికాకులు తెప్పిస్తున్నారన్న విశ్లేషణలు జరిగాయి.
అయితే హఠాత్తుగా పాల్ తెలంగాణ నుంచి ఏపీకి రాజకీయ క్షేత్రం మార్చినట్లుగా కనిపిస్తోంది. ఏపీలో ఆయన కారు యాత్ర చేపట్టారు. పాల్ రావాలి – పాలన మారాలి అంటూ కొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఆయన పర్యటనకు రెడీ అయ్యారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగబోనని సవాల్ చేస్తున్నారు. హఠాత్తుగా ఆయన ఏపీకి ఎందుకు మారారు.. ఏపీలో పాల్ రావాలి అనే నినాదం ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆయనను బయట ట్రోల్ చేస్తున్నా.. ఎంతో కొంత ప్రభావితం చేస్తారన్న ఉద్దేశంతో కొంత మంది దాడికి కూడా వెనుకాడటం లేదు. సిరిసిల్లలో ఆయనపై టీఆర్ఎస్ నేత ఒకరు దాడి చేశారు. ఏపీలో అయితే ఇంకా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అచ్చం గా వైసీపీ రంగులను పోలి ఉండేలా ఆయన పార్టీ కూడా జనంలోకి వెళ్తే తమకు ఇబ్బందేనని అనుకుంటే ప్రతిబంధకాలు ఎదురవ్వొచ్చు. అయితే అలా చేయడం వల్ల పాల్కే ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది.