నర్సాపురం నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్లకు ఆమోదం లభించింది. మూడు రోజుల కిందట.. ఏ పత్రాలు ఇవ్వకుండా నామినేషన్లు దాఖలు చేయడంతో.. ఆయన సీరియస్‌గా లేరన్న ప్రచారం జరిగింది. అయితే.. నామినేషన్లకు చివరి రోజు అయిన సోమవారం మాత్రం.. నర్సాపురం లోక్‌సభ స్థానానికి, అదే స్థానం నుంచి అసెంబ్లీ స్థానానికి అన్ని వివరాలతో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా వాటిని రిటర్నింగ్ అధికారి ఆమోదించారు.
భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు నిన్న ఆయన ఆలస్యంగా వెళ్లడంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను తీసుకోలేదు. నర్సాపురం బరిలో ఉండటం మాత్రం ఖాయం అయింది.
ఎన్నికల అఫిడవిట్లో అత్యంత కీలకమైన ఆస్తుల ప్రకటన విషయంలో.. కేఏ పాల్… ఖాళీ పత్రమే ఇచ్చారు. దానికి ఆయన … తనకు ఎలాంటి స్థిర, చరాస్తులు లేవని ప్రకటన చేశారు. తన ఆస్తులన్నీ.. స్వచ్చంద సేవా సంస్థలకు రాసిచ్చేశానని ప్రకటించారు. విదేశీ ఆస్తులను కూడా ప్రకటించాల్సి ఉంది. విదేశాల్లో కూడా.. తనకు ఎలాంటి ఆస్తులు లేవని.. కేఏ పాల్ స్పష్టం చేశారు. ఇది స్వచ్చందంగా ఇచ్చిన ధృవీకరణ పత్రం. ఆయన పేరు మీద ఫలానా ఆస్తులు ఉన్నాయని.. ఎవరైనా గుర్తించి ఫిర్యాదు చేస్తే పోటీకి అనుర్హుడయ్యే అవకాశం ఉంది.
మరో వైపు కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతి..తరపున దాదాపుగా వంద నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని చివరి క్షణంలో.. ఇతర పార్టీలకు చెందిన నేతలు వ్యూహాత్మకంగా… నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన ముఖ్యనేత పేరును పోలినట్లు ఉండేవారి పేర్లతో బీఫాం తీసుకుని నామినేషన్లు దాఖలు చేశారు. దాంతో కొంత మంది అభ్యర్థులకు దడ ప్రారంభమయింది. ఫ్యాన్ గుర్తు, హెలికాఫ్టర్ రెక్కల గుర్తు దాదాపు ఒక్కటిగాఉండటంతో.. గ్రామాల్లో వృద్ధులు.. పొరపాటున కొన్ని ఓట్లు తేడాగా వేసినా.. ఇబ్బంది పడతామని టెన్షన్‌కు గురవుతున్నారు.