కేఏ పాల్ వైసీపీకి దగ్గరయ్యారు. ఇటీవలి కాలంలో ఏమయిందో కానీ ఆయన వైసీపీ ప్రసంగీకుడిగా మారిపోయారు. గతంలో అయితే తనకు ఏది నచ్చితే అది చెప్పేవారు. కానీ ఇప్పుడు వైసీపీకి నచ్చేది చెబుతున్నారు. అవినాష్ రెడ్డికి మత్తుగా మాట్లాడుతున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు దగ్గరకు కూడా వెళ్లి హడావుడి చేశారు. కర్నూలు ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఆయన వెళ్లి పరామర్శించారు. అవినాష్ రెడ్డి చాలా మంచి వాడని కితాబిచ్చారు.
కేఏ పాల్ మాటల్ని చూసి.. పాపం వైసీపీ అనుకునేవారు ఎక్కువైపోయారు. వైసీపీ కోసం మాట్లాడేది పోసాని, అలీ, కేఏ పాల్ లాంటి మేధావులా.. వారితో ఇష్టారీతిన మాట్లాడించి ప్రజలకు ఏదో సందేశం ఇప్పించుకోవాలనుకుంటున్నారా అని.. ఆశ్చర్యపోతున్నారు. వీరిని ఎంగేజ్ చేసుకోవాలన్న సలహా ఎవరిదో కానీ వారికో దండం అని.. వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కేఏ పాల్ మాట్లాడే మాటల్ని వినే ఎవరూ సీరియస్ గా తీసుకోరు. అలాంటి వ్యక్తితో సీరియస్ టాపిక్ మాట్లాడించి..అవినాష్ రెడ్డి మంచోడని చెప్పించడానికి తాపత్రయపడటం అంటే.. దిగజారిపోయిన భావదారిద్య్రానికి నిదర్శనమన్న వాదన వినిపిస్తోంది.
వైసీపీ తరపున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది మేధావులు మాట్లాడారు. కానీ ఇప్పుడు వారిలో చాలా మంది సైలెంట్ అయ్యారు. పదవులు పొందిన వారు కూడా ఎందుకో సైలెంట్ అయ్యారు. కల్లాం అజేయరెడ్డిలాంటి వాళ్లు జగన్ ను నేరుగా ఇరికించేశారు. దీంతో ఇప్పుడు కేఏ పాల్, పోసాని, అలీ లాంటి వాళ్లను హైలెట్ చేసుకుంటున్నా వైసీపీ నేతలు. మా పార్టీ రేంజ్ కు వాళ్లే ఎక్కువ.. కింది స్థాయి నేతలు… విరక్తి చెందేలా వారు మాట్లాడుతున్నారు.