24 విభాగాల్లో పనిచేసే ప్రతి సాంకేతిక నిపుణుడి దృష్టీ దర్శకుడి కుర్చీపైనే ఉంటుంది. ఎందుకంటే… దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ది షిప్కాబట్టి. హీరోలు, నిర్మాతలు, రచయితలు, కెమెరామెన్లు, డాన్స్ మాస్టర్లు… దర్శకులుగా మారడం తరచూ జరిగేదే. అయితే కళా దర్శకులు దర్శకులుగా మారడం చాలా తక్కువ. ఇప్పుడు కళా దర్శకుడు అశోక్… ఇలాంటి కొత్త ప్రయత్నం చేశారు.
దాదాపు 150 చిత్రాలకు కళా దర్శకుడిగా సేవలు అందించారు అశోక్. అందులో.. బొబ్బిలిరాజా, మాస్టర్, డాడీ, టక్కరి దొంగ లాంటి సినిమాలున్నాయి. అరుంధతి, పౌర్ణమి, అంజి చిత్రాలకు మంచి పేరొచ్చింది. నంది అవార్డు కూడా అందుకున్నారాయన. ఇప్పుడు `’ఇష్టం` అనే సినిమాతో దర్శకుడిగా మారారు. చిత్రీకరణ కూడా సైలెంట్‌గా పూర్తి చేసేసుకున్నారు. కార్తీక్, పార్వతీ జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. సాధారణంగా కళా దర్శకులు, ఫైట్ మాస్టర్లు, కెమెరామెన్లు దర్శకత్వం వహిస్తే.. యాక్షన్ చిత్రాలనే ఎక్కువగా ఎంచుకుంటారు. అశోక్ మాత్రం ప్రేమకథ చూపించబోతున్నారు. మరి దర్శకుడిగా అశోక్‌కి ఎన్ని మార్కులు పడతాయో చూడాలి.