ఏప్రిల్ 27.. ఈ డేట్ గురించి గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. ఇదే రోజున భరత్ అను నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈలోగా రోబో 2 కూడా వస్తోందని నిర్మాతలు ప్రకటించారు. ఈ మూడు సినిమాల మధ్య క్లాష్ వచ్చింది. భరత్ అను నేను – నా పేరు సూర్య నిర్మాతలు మాట్లాడుకుని రిలీజ్ డేట్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు. మరోవైపు రోబో 2 నిర్మాతల్ని కలిసి పరిస్థితి వివరించాలనుకున్నారు. రోబో 2 రిలీజ్ డేట్ ప్రకటించినా అది వస్తుందన్న నమ్మకాలు ఎవ్వరికీ లేవు. అందుకే.. రోబో 2 రాదన్న ధీమాతోనే… తెలుగు నిర్మాతలు ఉండేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా కాలా విడుదల తేదీ వచ్చింది. రజనీకాంత్, పా.రంజిత్ కాంబోలో రూపొందిన చిత్రమిది. ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించేసింది. దాంతో… తెలుగు నిర్మాతలు మరోసారి గతుక్కమన్నారు. తమిళంలో 27న వస్తే, తెలుగులోనూ కచ్చితంగా అదే రోజున విడుదల చేస్తారు. మరి ఇప్పుడు తెలుగు నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. రోబో అయితే ఎలాగూ రాదని కాస్త రిలాక్స్ అయ్యేవారేమో గానీ, కాలాదాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులూ జరుగుతున్నాయి. సో.. తెలుగు నిర్మాతలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే.