మాస్… తలైవర్ మాస్! ‘కాలా’ టీజర్ అంతటినీ రజనీకాంత్ మాస్ మేనరిజమ్స్ తో నింపేశాడు దర్శకుడు పా. రంజిత్. రిజల్ట్ సంగతి పక్కన పెడితే ‘కబాలి’లో రజనీని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో… అటువంటి స్టైల్లో చూపించాడు. కానీ, అందులో సూపర్ స్టార్ ఎక్కువగా సూటూ బూటూ వేసుకున్నాడు. తమిళ మాస్ అంటే ఎలా వుండాలి? లుంగీ కంపల్సరీ. అది తెలుసుకున్న రంజిత్ ఈసారి రజనీ చేత లుంగీ కట్టించాడు. నల్ల లుంగీ… తెల్ల గడ్డం… రజనీ నడుస్తుంటే థియేటర్లలో విజిల్స్ మోత మోగడం ఖాయం. టీజర్లో రజనీ యాక్టింగ్, యాటిట్యూడ్ ఒక ఎత్తు అయితే… ఆయన చెప్పిన డైలాగులు మరో ఎత్తు.
‘క్యారే… సిట్టింగా? నేను ఒక్కణ్ణి వున్నా… దమ్మున్నోడు, దిల్లున్నోడు రండ్రా!’ అంటూ సోలోగా ఫైట్ చేశాడు. తలైవా మార్క్ హీరోయిజమ్ చూపించాడు. చివర్లో ‘నువ్ నా రౌడీయిజమ్ ఇంకా చూడలేదు. చూస్తావ్రా’ అని చెప్పిన డైలాగ్ హైలైట్.
టీజర్లో హిందీ నటులు నానా పాటేకర్, హ్యూమా ఖురేషి, నటి ఈశ్వరరావులను చూపించాడు. లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా రజినీకాంత్ కొత్త సినిమా టీజర్ వచ్చిందంటే అందరూ ఓ లుక్ వేయాల్సిందే. ఆల్రెడీ నెటిజన్ల లుక్కులు, లైకులు పడుతుండడంతో టీజర్ యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శుక్రవారం పది గంటలకు టీజర్ విడుదల చేస్తామని రజనీకాంత్ అల్లుడు, సినిమా ప్రొడ్యూసర్ ధనుష్ చెప్పాడు. చెప్పిన టైమ్ కంటే చాలాముందు టీజర్ విడుదల చేశారు.