సినిమా విడుదలకు ముందే.. అందులో కొంత భాగాన్ని ప్రేక్షకులకు ఫ్రీగా చూపించేయడం నిజంగా ఓ సాహసం. తెలుగులో అడపా దడపా అలాంటి ప్రయత్నాలు జరిగాయి. తమిళ కథానాయకుడు విజయ్ ఆంటోనీ ఈ సంప్రదయాన్ని బాగా పాటిస్తున్నాడు. బిచ్చాగాడు, భేతాళుడు సినిమాల్లో తొలి కొన్ని సన్నివేశాల్ని విడుదలకు ముందే చూపించాడు విజయ్. ఇప్పుడు ఆ సెంటిమెంట్ కొనసాగిస్తూ… `కాశి` చిత్రంలోని తొలి 7 నిమిషాల సన్నివేశాల్ని ముందే విడుదల చేశారు.
భరత్ అనే ఓ డాక్టర్ కథ ఇది. తను అమెరికాలో గొప్ప డాక్టర్. అమ్మానాన్నలతో కలసి హాయిగా ఉంటాడు. తనకు లేనిది ఏదీ లేదు. కానీ… ప్రతీరోజూ ఓ కల అతన్ని భయపెడుతూ ఉంటుంది. తన చిన్నతనంలో ఓ పాము కరవడానికి వస్తున్నట్టు, ఓ ఎద్దు తరుముతున్నట్టు వచ్చే ఆ కల.. ప్రతీసారీ నిద్రలోంచి ఉలిక్కిపడేలా చేస్తుంటుంది. ఓరోజు.. తనకో నిజం తెలుస్తుంది. తన సొంత అమ్మానాన్నలు వీళ్లు కాదని, ఎక్కడో విజయవాడ అనాధాశ్రమం నుంచి తనని దత్తత తీసుకొచ్చి, డాక్టర్ చేశారని అర్థమవుతుంది. తన చిననాటి కలకూ, తన బాల్యానికీ ఏదో సంబంధం ఉందని గ్రహిస్తాడు భరత్. అందుకే తనని పెంచిన తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఓ వారం రోజులు పాటు ఇండియాలో ఉండి, తన బాల్యం నాటి సంగతులు తెలుసుకుందామని ఇండియాకి వస్తాడు. అంతే.. అక్కడి వరకే `కాశీ`ని చూపించారు. మిగిలిన కథేంటో తెలుసుకోవాలంటే `కాశీ` సినిమా చూడాల్సిందే.
కథ మొదలైన తీరు, దాన్ని నడిపిన పద్ధతి చూస్తే… కచ్చితంగా ఇదో థ్రిల్లర్ అనిపిస్తోంది. విజయ్ ఆంటో్నీ సినిమాలన్నీ స్లోగా మొదలవుతాయి. కథలో మలుపులు ఉత్కంఠత కలిగిస్తాయి. ఆ లక్షణాలు ఈ సినిమాలోనూ కనిపిస్తాయి. తరవాత ఏం జరిగిందో? అనే కుతూహలం రేపేలా.. తొలి సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. భరత్ చిన్నప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఉత్సుకత రేపడంలో సక్సెస్ అయ్యాడు. ఈ మాత్రం కథని, సన్నివేశాల్ని రివీల్ చేస్తే… కథలో కీ పాయింట్స్ తెలిసిపోతాయన్న భయపడాల్సిన పని లేదు. ఇది నిజంగానే ఓ మార్కెట్ స్ట్రాటజీ. కాస్త రుచి చూపించి మిగిలిన సినిమా చూడాలన్న ఆసక్తిని రేకెత్తించడంలో ఇదో మంచి ప్రయత్నం. ట్రైలర్లు, టీజర్ల కంటే… ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని చేస్తే సినిమాకి పబ్లిసిటీ పరంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఈనెల 18న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో మంచి ఓపెనింగ్స్ వస్తే గనుక.. కాశీ చేసిన ఈ ప్రయత్నం విజయవంతం అయినట్టే.