విడుదలకు ముందు కబాలి సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఈ సినిమా రూ.500 కోట్లు సాధించి తీరుతుందని నిర్మాత థాను అతి విశ్వాసంతో ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. జనాలు అదే అనుకొన్నారు. ఈ హైప్ చూసి సుల్తాన్ రికార్డుల్ని కూడా దాటుకొంటూ వెళ్లిపోతుందేమో అని లెక్కలేశారు. కానీ… కబాలికి తొలిరోజే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఈ సినిమాని అభిమానులూ భరించలేరు,.. అని విశ్లేషకులు తీర్పు చెప్పేశారు. ఫ్యాన్స్ కూడా థియేటర్ల నుంచి మొహాలు వేలాడేసుకొని వస్తున్నారు. లాభాల మాట అటుంచితే.. కొన్న బయ్యర్లు పూర్తిగా మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే లింగ, కొచ్చడియాన్ సినిమాలు కొన్న బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఆ లెక్కలు ఇప్పటికీ తేలలేదు. లింగ ఎఫెక్ట్ కబాలిపై పడింది. కోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. కబాలిని ఆపాల్సిందే అంటూ కొంతమంది వీర ప్రయత్నాలు చేశారు. కానీ వాటిని దాటుకొచ్చి బాక్సాఫీసు దగ్గరకు చేరింది కబాలి. అయితే.. ఇకముందు ఇంత ఈజీగా గేమ్ ఉండకపోవొచ్చు. రజనీ రాబోయే సినిమా రోబో 2పై ఈ ప్రభావం విపరీతంగా పడే అవకాశం ఉంది. లింగ బయ్యర్లు గోల చేసినట్టే,… రేపొద్దుట కబాలిని కొన్న బయ్యర్లూ… రోబో 2 విడుదలకు అడ్డుపడడం ఖాయం. లింగ విషయంలో న్యాయం జరగలేదు కాబట్టి… బయ్యర్లు ఇంకాస్త పట్టు పడే అవకాశాలుంటాయి. రోబో 2 హక్కుల్ని లింగ, కబాలి సినిమాలతో నష్టపోయినవారికి ఇవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి రజనీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడో చూడాలి.