కబాలి ఎఫెక్ట్ అటు తిరిగి ఇటు తిరిగి రోబో 2పైనే పడబోతోంది. లింగ తో నష్టపోయిన పంపిణీదారులు కబాలిని అడ్డుకొనేందుకు ప్రయత్నించినట్టే.. కబాలి బాధితులు రోబో 2పై పడతారని ఇప్పుడే రోబో బృందం అంచనా వేయగలిగింది. ఆ వ్యవహారం అటుంచితే… పెరిగిన అంచనాలు కబాలి పరాజయానికి ప్రధాన కారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. రోబో 2కి ఇంతకు మించి అంచాలు పెరగడం ఖాయం. ఎందుకంటే శంకర్ బ్రాండ్ అలాంటిది. ఐ సినిమా ఫ్లాప్ అయినా.. శంకర్ ఇమేజ్ చెక్కు చెదరలేదు. దానికి తోడు రోబో లాంటి బ్లాక్ బ్లస్టర్ కి సీక్వెల్ ఇది. బడ్జెట్టే రెండొందల కోట్లు దాటింది. పైగా అక్షయ్ కుమార్ లాంటి హీరో.. ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. దాంతో రోబో 2 అంచనాలు ఆకాశానికి తాకడం ఖాయం.
ఈ విషయమే రోబో 2 దర్శక నిర్మాతల్ని భయపెడుతోంది. హైప్ పెరక్కుండా ఏం చేయాలి?? అనేదెలాగో తెలియక శంకర్ సతమతమవుతున్నాడు. అందుకే తన టీమ్ మొత్తం అందరితో ఓ యమర్సెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశాడట. రోబో 2 గురించి ఎక్కడా మాట్లాడొద్దని తన టీమ్‌ని హెచ్చరించడట శంకర్. దానికి తోడు బడ్జెట్ విషయంలోనూ పునరాలోచనలో పడ్డాడట. ఫ్లాప్ ఎదురైతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో శంకర్‌కి తెలుసు. పైగా.. రోబో 2 సినిమాకి కబాలిలా హై రేట్లకు కొనడానికి బయ్యర్లు కూడా సిద్ధంగా ఉండరని తెలుసు. అటు తిరిగి ఇటు తిరిగి కబాలి కొన్నవాళ్లకే ఈ సినిమాని తక్కువ ధరకు అమ్మాల్సివచ్చినా రావొచ్చు. అందుకే ఇకమీదట బడ్జెట్ పూర్తిగా కంట్రోల్లో ఉండాలని శంకర్ భావిస్తున్నాడట. ఈ విషయంలో రజనీకాంత్నుంచి కూడా కొన్ని సలహాలూ సూచనలూ అందాయని అందుకే శంకర్ ఇలా అప్రమత్తమవుతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి కబాలి ఎఫెక్ట్ మొదలైంది. ఇది ఎన్ని పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.