కబాలి రైట్స్ కోసం తెలుగునాట భారీ పోటీ ఏర్పడింది. కాకలు తీరినవాళ్లంతా.. ఈ సినిమా హక్కుల కోసం క్యూ కట్టారు. దానికొచ్చిన హైప్ ఆ స్థాయిలో ఉందిలెండి. అయితే.. తొలిరోజే ఈ సినిమాకి డివైడ్ టాక్ రావడంతో ఆ ప్రభావం వసూళ్లపై పడింది. తొలి రోజు రూ.8.5 కోట్ల వరకూ వసూలు చేసిన కబాలి… రెండోరోజుకి పూర్తిగా డ్రాప్ అయ్యింది. తొలివారంలో రూ.22 కోట్లకు మించి రాలేదు. ఈ సినిమా తెలుగు రైట్స్ రూ.32 కోట్లకు కొన్నారు. పబ్లిసిటీ మరో కోటి వరకూ అయ్యింది. అంటే రూ.33 కోట్లన్నమాట. కబాలి వల్ల తెలుగు నిర్మాతకు రూ.10 కోట్ల వరకూ నష్టాలు రావొచ్చన్నది ఓ అంచనా. ఆల్రెడీ లింగ దెబ్బకు టాలీవుడ్ బెంబేలెత్తిపోయింది. కబాలి ఫ్లాప్ అయినా నష్టాలు ఈ రేంజులో ఉంటాయని ఎవ్వరూ ఊహించలేదు. విడుదలకు ముందు వచ్చిన హైప్ వల్ల తొలిరోజు భారీ వసూళ్లొచ్చాయి. దాంతో కబాలి కాస్తలో కాస్తయినా ఊపిరి పీల్చుకోగలిగింది. ఎప్పుడైతే ఫ్లాప్ టాక్ వచ్చిందో అప్పటి నుంచీ థియేటర్లు ఖాళీ అయ్యాయి. బయ్యర్లను ఆదుకొంటానని రజనీకాంత్ మాటిచ్చినట్టు చెన్నై వర్గాలు చెబుతున్నాయి. పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత భర్తీ చేయడానికి రజనీ సిద్ధంగానే ఉన్నాడట. దాంతో కబాలి రైట్స్ కొన్న షణ్ముఖ పిక్చర్స్ కాస్త ఊపిరి తీసుకొంటోంది. మరి ఆ నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారో చూడాలి.