తనుష్
రేపు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4 వేల ధియేటర్లలో 5 దేశాలలో విడుదల కాబోతున్న ‘కబాలి’ మ్యానియా ముందు సల్మాన్ ‘సుల్తాన్’ షేక్ అయిపోతోంది. ఇప్పటికే కేవలం 12 రోజులలో 500 కోట్లు వసూలు చేసి టాప్ గేర్ లో దూసుకుపోతున్న ‘సుల్తాన్’ స్పీడ్ కు ‘కబాలి’ బ్రేక్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. రేపువిడుదల కాబోతున్న ‘కబాలి’ కోసం దేశవ్యాప్తంగా దాదాపు 600 థియేటర్ల నుంచి ‘సుల్తాన్’ చిత్రాన్ని తొలగిస్తుండడంతో ఇక సల్మాన్ ప్రభంజనానికి గండి పడినట్లేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ ను ‘ఈద్’ రోజు సెలవు కాబట్టి పండుగ సెలవలను టార్గెట్ చేస్తూ తన సినిమాను విడుదల చేస్తే “నా సినిమా రిలీజైన రోజే సెలవు” అని రజనీకాంత్ పంచ్ వేసినట్లుగా ‘కబాలి’ విడుదల రోజున చెన్నైలోని సాఫ్ట్ వేర్ కంపెనీలు అన్నీ సెలవు ప్రకటించడమే కాకుండా తమ సంస్థ ఉద్యోగులకు ‘కబాలి’ టిక్కెట్లు ఇచ్చి చూసి ఎంజాయ్ చేయమని ప్రోత్సహిస్తున్నారు అంటే రజినీకాంత్ మ్యానియా ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇది చాలదు అన్నట్లుగా బెంగుళూరులోని స్టార్ హోటల్స్ లో ‘కబాలి’ స్పెషల్ షోలు వేయడం చూస్తూ ఉంటే ఈసినిమా హైక్ ఎంత తారాస్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ హైక్ ఇలా ఉంటే మన టాలీవుడ్ లో మాత్రం ‘కబాలి’ రేపు విడుదల కావడం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ సినిమాను 30 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొని పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ ఈరోజు ఒకప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ కొందరు ప్రముఖ వ్యక్తులు ‘కబాలి’ తెలుగు రిలీజ్ కు అడ్డుపడుతున్నారని కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ‘కబాలి’ ని వెంటాడుతున్న ‘విక్రమ సింహా’ నష్టాల కష్టాలు ఇంకా పరిష్కారం కాలేదని తాము చిన్న వాళ్ళం కాబట్టి తమను టాలీవుడ్ లోని చాలామంది ఇబ్బంది పెడుతున్నారు అని ఈ సినిమా పంపిణీ దార్లు ప్రవీణ్ మరియు చౌదరీలు మీడియాకు లీకులు ఇస్తున్న నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కాబోతున్న ‘కబాలి’ టాలీవుడ్ లో విడుదల కాదా ? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి..