తమిళనాడు ఎన్నికల్లో మోదీ కచ్చతీవు ద్వీపం అంశాన్ని రాజకీయం చేశారు. ఇప్పుడది ముఖ్యాంశంగా మారింది. తమిళనాట డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలకు పలు దఫాలుగా కచ్చతీవు ఎన్నికల అస్త్రంగా ఉపయోగపడింది. ఇప్పుడు మరోసారి తెరపైకి తెచ్చారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీతో 2016లో భేటీ అయిన సందర్భంగా కచ్చతీవు అంశాన్ని ప్రస్తావించారు. తమిళనాడు- శ్రీలంక జాలరుల మధ్య తరచూ ఘర్షణలకు ఆలవాలంగా మారిన కచ్చతీవు వివాదాన్ని పరిష్కరించవలసిందిగా కోరారు. ఈ అంశాన్ని పట్టించుకోని ప్రధాని.. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో హఠాత్తుగా కచ్చతీవు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇండియా -శ్రీలంక దేశాలను వేరు చేస్తున్న పాక్ జలసంధిలో ఉన్న అతి చిన్న దీవి కచ్చతీవు. అక్కడ జనం ఉండరు. ఒక్క చర్చి ఉంటుంది. బ్రిటిష్ వారు ఈ దీవిని తమ నావికా దళాలకు తుపాకీ శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించుకునేవారు.
1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకే మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కచ్చతీవు శ్రీలంక అధీనమైంది. ఈ ఒప్పందంలో భాగంగా అనేక లక్షల తమిళులు లబ్ది పొందారు. ప్రాణాలు నిలుపుకున్నారని చిదంబరం చెబుతున్నారు. అది పరిష్కరించిన సమస్య అని..దాన్ని ఎందుకు ఇప్పుడు వివాదం చేస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత వివాదం వల్ల శ్రీలంకతోసంబంధాలు దెబ్బతింటాయని ఆయన ఆందోళన.
కచ్చతీవు సమీపాన అపారమైన మత్స్య సంపద ఉన్న కారణంగా తెలిసీ తెలియక శ్రీలంక జలాల్లోకి ప్రవేశిస్తున్న తమిళ జాలర్లను లంక నావికా దళం అరెస్టు చేస్తోంది. వారి విలువైన పడవలను, వలలను ధ్వంసం చేస్తోంది. . ఏటా కచ్చతీవులోని సెయింట్ ఆంథొని చర్చిలో జరిగే వేడుకలకు మాత్రమే భారత జాలర్లకు అనుమతి ఉందని వాదిస్తున్న శ్రీలంక ప్రభుత్వం, చేపల వేటపై ఉక్కుపాదం మోపుతోంది. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించాల్సింది.. రాజకీయ ఎజెండాగా చేసి కాదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.