కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కాదంబరి జెత్వానీ అనే హీరోయిన్ కు జరిగిన అన్యాయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం వేగంగా స్పందించింది. అయితే ఇప్పుడు ఆ కాదంబరి జెత్వానీ తనకు న్యాయం కోసం మరోసారి ఉన్నతాధికారుల్ని కలుస్తోంది. కేసు ఎక్కడిదక్కడే ఉంది. తనపై అక్రమ కేసులు పెట్టారని పోలీసులు నిర్దారించినా దాన్ని తొలగించడం లేదని ఆమె బాధపడుతోంది. ఆ కేసును తొలగించాలని కోరుతోంది.
కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నాయకుడు కాదంబరి జెత్వాని తన పొలాన్ని అక్రమంగా అమ్మడానికి ప్రయత్నించిందని రూ.ఐదు లక్షలు అడ్వాన్స్ ను ఇతరుల దగ్గర తీసుకుందని కేసు పెట్టారు. కేసు పెట్టడానికి ముందే ముంబై వెళ్లి జత్వానీని అరెస్టు చేసి తీసుకు వచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసుకున్నారు. అంటే ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. ఐదు లక్షలు ఇచ్చారని ఎవరు పేర్లు అయితే ఎఫ్ఐఆర్లో రాశారో వాళ్లు తాము ఎవరికీ డబ్బులివ్వలేదని..తమకు జత్వానీ ఎవరో తెలియదని వాంగ్మూలం ఇచ్చారు.
తప్పుడు కేసులు పెట్టి వేధించినట్లుగా తేలడంతో ముగ్గురు ఐపీఎస్లు.. ఇద్దరు ఇతర పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేశారు. వారిపైనా కేసులు ఉన్నాయి. అయితే వారందరూ ముందస్తు బెయిల్ తెచ్చుకునే వరకూ పోలీసులు అరెస్టు చేయలేదు. కేసులు ఉన్నా వారు హాయిగానే ఉన్నారు. ఇంత తప్పుడు కేసు అని తెలిసినా జెత్వానీ తనపై కేసును ఉపసంహరించాలని కోరుతోంది. ఆమెకు ఐద్వా వంటి మహిళా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. తాజాగా ఆమె డీజీపీని కలిశారు. పరిశీలించి సమాచారాం ఇస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.
జెత్వానీ కేసు చిన్నది కాదు. బడా పారిశ్రామికవేత్తతో కూడిన వ్యవహారం . అందుకే ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటంతో ముందుకు కదలడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.