కడప మేయర్‌కు పదవి గండం ఏర్పడింది. ఆయన వైసీపీ నాయకుల మార్క్ దోపిడీని కార్పొరేషన్ లో చేశారు. కాంట్రాక్టులు తన బంధువులకు ఇచ్చుకుని పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై ప్రభుత్వం విజిలెన్స్ తో విచారణ చేయించింది. పూర్తి స్థాయి ఆధారాలతో ఆయనకు నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అక్రమాలకు పాల్పడినందున పదవి నుంచి ఎందుకు తీసేయకూడదో చెప్పాలని ఆదేశించింది.
పదిహేను రోజుల్లోపుల వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు సమాధానం ఇవ్వాల్సి ఉంది. సమాధానం ఎలా ఉన్నా ఆయనను పదవి నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన అవినీతిపై విచారణ చేయించాలని ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాసులరెడ్డి పట్టుబడుతున్నారు. తర్వలో కడప కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. జగన్ కు నమ్మిన బంటు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఆయన వద్ద మార్కులు కొట్టేసిన సురేష్ బాబు ప్రతీ సారి మేయర్ గా అవకాశం పొందుతున్నారు. జగన్ వద్ద ఉన్న పలుకుబడిని ఆసరాగా చేసుకుని కార్పొరేషన్ ను దోచుకున్నారు.
కడప టౌన్ లో వైసీపీ ఓడిపోవడానికి మేయర్ సురేష్ అవినీతి కూడా ఓ కారణం అని వైసీపీ నేతలు చెబుతారు. కార్పొరేటర్లు కూడా ఆయనకు వ్యతిరేకంగా చాలా ఉన్నారు. ఎన్నికలకు ముందే పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు అవిశ్వాసం పెట్టకపోయినా మేయర్ పదవి మాత్రం ఊస్టింగ్ కానుంది. ఇటీవలి కార్పొరేషన్ సమావేశాల్లో ఎమ్మెల్యేలకు కుర్చీ వేయకుండా మేయర్ అవమానించారు. ఇప్పుడు ఆయన చెయిర్‌కే ఎసరొచ్చింది.