కడప జిల్లాలో ఇటీవలి కాలంలో వరుసగా హత్యలు జరుగుతున్నాయి. అదీ కూడా అవినీతిని ఏ అంశంపై ప్రశ్నించారో… అక్కడికే తీసుకెళ్లి హత్య చేస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో గండికోట ముంపు ప్రాంతం నష్టపరిహారం విషయంలో… అనర్హుల్ని చేర్చి పెద్ద ఎత్తున డబ్బులు నొక్కేస్తున్నారని ఆరోపణలు రావడంతో.. ఓ యువకుడు.. పోరాటం చేశాడు. అతను రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి. దీనికి సంబంధించి జరిగిన గ్రామసభలోనే ఆ యువకుడ్ని హత్య చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. కానీ నిందితులు ఎవరో.. వారిని అరెస్ట్ చేశారో లేదో క్లారిటీ లేదు. ఆ తర్వాత ఓ మాజీ జవానును కూడా హత్య చేశారు.
తాజాగా నందం సుబ్బయ్య అనే టీడీపీ నేతను ఇళ్ల స్థలాల పంపిణీ ప్రదేశంలో హత్య చేశారు. ఆ హత్య అత్యంత దారుణంగా ఉంది. సుబ్బయ్య.. కొద్ది రోజులుగా… ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అవినీతిపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. సవాళ్లు చేస్తున్నారు. దీన్ని సహించలేకనే.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అనుచరులు…బంగారు రెడ్డి అనే ఆయన బావమరిది కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాత్రం… వివాహేతర బంధం జరిగి ఉండొచ్చని పోలీసుల కంటే ముందుగానే చెప్పారు. పోలీసులు ఆ దిశగానే వెళ్లే అవకాశం ఉంది.
కడప జిల్లాలో జరుగుతున్న హత్యలు అత్యంత దారుణమైనవి. ప్రజల్లో భయాందోళనలు కల్పించి.., ఎవరైనా నోరెత్తితే అలాంటి పరిస్థితులే ఏర్పడతాయని.. చెప్పడానికి అన్నట్లుగా ఎక్కడ అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపిస్తాయో.. అక్కడే దారుణంగా హత్య చేస్తున్నారు. కానీ.. బాధితులెవరికి న్యాయం జరుగుతున్న సూచనలు కనిపించడం లేదు. నిందితులు దొరుకుతున్న సూచనలు కూడా లేవు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గతంలో తెలుగుదేశం పార్టీ కొన్ని ప్రత్యేకమైన ఆరోపణలు చేసేది. వైసీపీ వస్తే నేరగాళ్ల రాజ్యం వస్తుందని.. ఎవరి ప్రాణాలకు గ్యారంటీ ఉండదని.. ఆ ప్రచారం సారాంశం. అయితే ప్రజలు దాన్ని నమ్మలేదని… వైసీపీకి లభించిన విజయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజల్లో ఓ అభిప్రాయాన్ని మాత్రం ప్రతిపక్ష పార్టీలు కల్పించాయి. ప్రభుత్వం ఆ అభిప్రాయం తప్పు అని నిరూపించుకోవాల్సి ఉంది. కానీ ఇప్పుడు జరుగుతోంది వేరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దాడులు జరుగుతున్నాయి. కడప జిల్లాలో హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యల వెనుక అవినీతిని ప్రశ్నించడం అనే కోణం తెరపైకి వస్తోంది. దీంతో.. మరో సారి ప్రజల్లో భయాందోళనలు పెరిగే ప్రమాదం ఏర్పడింది.