ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వం వేధిస్తోందంటూ… ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోని ప్రైవేటు ఆస్పత్రులు తాము కరోనా చికిత్స అందించబోమంటూ బోర్డులు పెట్టేశాయి. దీనికి కారణం.. ప్రైవేటు ఆస్పత్రులపై కొద్ది రోజులుగా… ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ, విజిలెన్స్లతో దాడులు చేయిస్తోంది. ఏ చిన్న తేడా కనిపించినా పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తోంది. డాక్టర్లను అరెస్ట్ చేయిస్తోంది. వీటిని కొద్ది రోజులుగా భరిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు .. ఇప్పుడు తెగించాయి. తాము ట్రీట్ మెంట్ చేయబోమని స్పష్టం చేస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం.. వైద్య సౌకర్యాలు పెంచడానికి ప్రయత్నించాల్సింది పోయి.. ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో సోదాల పేరుతో హడావుడి చేస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులు రోగుల్ని దోపిడి చేస్తున్న మాట నిజమే కానీ.. ఇప్పుడు ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాల్సిన పరిస్థితుల్లో మరింత సమర్థంగా వారిని వినియోగించుకోవాల్సింది పోయి… అధిక రేట్లు వసూలు పేరుతో వేధించడం.. ఇబ్బందికరంగా మారింది. కార్పొరేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం ఇంత వరకూ చర్యలు తీసుకున్నట్లుగా కానీ.. ఫైన్ వేసినట్లుగా కానీ లేదు. కానీ జిల్లాల్లో .. దిగువ మధ్యతరగతి.. పేద వారికి ఎక్కువగా వైద్య ం చేసే ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని కేసులు నమోదు చేస్తున్నారు.
కొన్ని కోట్ల కేసులు కూడా నమోదు చేసి డాక్టర్లను అరెస్ట్ చేయడం.. వ్యతిరేకతకు కారణం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా బెడ్లు దొరకడం లేదు. మరో వైపు కరోనా రోగులు.. రోజుకు పదిహేను వేల వరకూ కొత్తగా వస్తున్నారు. వీరిలో ఐదు వేల మందికి బెడ్లు అవసరమైనా… ఏర్పాటు చేయడం కష్టమవుతోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ప్రైవేటు రంగంలోని ఆస్పత్రిని పక్కాగా వినియోగించుకోవాల్సి ఉంది. కావాలంటే.. తాము ప్రభుత్వానికి హాస్పిటల్స్ అప్పగిస్తామని.. నిర్వహించుకోవచ్చని.. కొంత మంది డాక్టర్లు తేల్చి చెప్పేలా పరిస్థితి వచ్చిందంటే… పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.