కడప తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో ఆ పార్టీ అధినాయకత్వానికి కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీ మార్పు ప్రచారం…మరో వైపు సీఎం రమేష్, వరదరాజుల రెడ్డి వ్యవహారంతో గందరగోళంగా మారింది. గత ఎన్నికల్లో కడప జిల్లా నుంచి గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. సోదరుల ఒత్తిడితో మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరే ఆలోచన చేశారని కడప జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. వైసీపీ అగ్రనేతలతో మేడా సోదరులు,.. బంధువులు మాట్లాడారని ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికీ తెరదించుతూ టీడీపీని వీడేది లేదంటూ మేడా మల్లికార్జునరెడ్డి సీఎంను కలిసిన తర్వాత ప్రకటించారు.
మరో వైపు ఎంపీ సీఎం రమేష్- మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రొద్దుటూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న వరదరాజులరెడ్డి కొన్ని నెలలుగా రమేష్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీకి తలనొప్పిగా మారింది. జిల్లాలో నాలుగైదు అసెంబ్లీ సీట్లు గెల్చుకునే అవకాశం టీడీపీకి ఉంటే…వర్గ విభేదాలతో ఆ అవకాశాలకు గండికొడ్తున్నారని రమేష్‌పై విమర్శలు చేస్తున్నారు. వైసీపీతో సీఎం రమేష్‌కు సంబంధాలు ఉన్నాయంటున్నారు.
వరదరాజులు, రమేష్ మధ్య… కాంట్రాక్ట్ పనుల దగ్గర తలెత్తిన మనస్పర్థలు …రాజకీయాల్లో వర్గ పోరుగా మారాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ గొడవను ఎప్పటి నుంచో గమనిస్తున్న చంద్రబాబు…ఎప్పటికప్పుడు వరదరాజులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బహిరంగ విమర్శలు, ఆరోపణలు తగదని హితోపదేశం చేశారు. కానీ వీరు మారలేదు. ప్రొద్దుటూరు అభివృద్ధికి భారీగా ఎంపీల్యాడ్స్ కేటాయిస్తే…వరదరాజులురెడ్డి పెత్తనం సాగిస్తూ వర్క్‌లు సరిగ్గా చేయట్లేదని, పైగా నిధుల్లో గోల్మాల్ జరిగిందని ఇటీవల రమేష్ ఆరోపించారు.
చంద్రబాబు..కృష్ణా జలాల్ని పులివెందులకు అందించారు. వైఎస్ కుటుంబానికి సాధ్యం కానిది చంద్రబాబు చేసి చూపించారన్న పాజిటివ్ వేవ్ ప్రజల్లో ఏర్పడింది. పార్టీ బలోపేతానికి స్థానిక నేతలు కృషిచేస్తే కడప జిల్లాలో టీడీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం ఇదే ధీమా కనబరుస్తున్నారు. పులివెందులతో సహా కడప జిల్లాలో జెండా ఎగరేస్తామంటున్నారు. కానీ ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలు గ్రూపులుగా రాజకీయాలు నడుపుతున్నారు. ఇదే టీడీపీని కలవరపరుస్తోంది.