కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే తాను ప్రధానంగా పోరాడాల్సింది సోదరుడు జగన్ పైనేనని షర్మిలకు తెలుసు. అందుకే మొహమాటాలు పెట్టుకునే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. ఆమెకు సమయం చాలా తక్కువ ఉంది. మరో నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ ఉంది. ఆ తర్వాత తొలి విడతలోనే ఎన్నికలు పూర్తయిపోతాయి. అంటే గట్టిగా రెండు నెలలు మాత్రమే షర్మిలకు సమయం ఉంది. ఈ లోపు కాంగ్రెస్ ఎంతగా పుంజుకునేలా చేస్తే ఆమె రాజకీయ జీవితానికి అంత భరోసా వస్తంది.
షర్మిల రాజకీయంగా బలపడాలంటే ముందు సొంత గడ్డపై గట్టి పట్టు సాధించాలి. అంటే కడప జిల్లాలో ఆమె తనదైన ముద్ర వేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎంత రాజకీయం చేసిన వృధా అవుతుంది. ఆ విషయం ఆమెకు తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో మరో సోదరి , వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తండ్రిని హత్య చేసిన వారిపై అలుపెరగని న్యాయపోరాటం చేస్తున్న ఆమె రాజకీయ రంగంలోనూ తేల్చుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. నిజానిక సునీత డాక్టర్ గా ఉన్నారు కానీ ఎప్పుడూ రాజకీయాల గురించి ఆలోచించలేదు. ఎప్పుడూ మీడియా ముందుకు కూడా రాలేదు. కానీ తండ్రి హత్య తర్వాత ఆమె అసామాన్యంగా పోరాడుతున్నారు. కుటుంబంలో కూడా మద్దతు రావడంతో ఆమె రాజకీయాల్లోనూ అడుగు పెట్టాలని అనుకుంటున్నారు. వైఎస్ సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అటున్నారు. షర్మిల, సునీత పులివెందుల అసెంబ్లీ, కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
వైఎస్ సునీత, వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో దిగితే కడప జిల్లాలో ఫ్యామిలీ వార్ జరుగుతుంది. వైఎస్ చనిపోయిన తర్వాత వివేకానందరెడ్డి కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. అప్పట్లో పులివెందుల ఉపఎన్నికల్లో వినేకానందరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఓడిపోయారు. కానీ అప్పట్లో ప్రజల్లో విపరీతమైన సానుభూతి ఉంది. కుటుంబం కూడా వైఎస్ జగన్ వెంటే ఉంది. కానీ ఇప్పుడు వైఎస్ కుటుంబంలో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. . ఈ క్రమంలో పులివెందులలో అన్నా, చెల్లెళ్లు రాజకీయ ప్రత్యర్థులుగా పోరాటం జరిగితే ఊహించనంతగా రాజకీయం మారుతుంది.