కడప జిల్లాకి చెందిన వైకాపా ఎమ్మల్యే ఆది నారాయణ రెడ్డి తను తెదేపాలోకి రావడానికి సిద్దంగా ఉన్నానని, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నానని, తనదేమీ ఆలశ్యం లేదని తెదేపాదే ఆలశ్యమని బహిరంగంగానే చెప్పారు. కానీ ఆయన చేరికకు తెదేపా సీనియర్ నేత మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఇంతవరకు ఆయన ఎదురుచూస్తున్న ఆ గ్రీన్ సిగ్నల్ రాలేదు. సరిగ్గా ఇదే సమయంలో కడప జిల్లాలోనే వైకాపాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు త్వరలో తెదేపాలో చేరబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. బహుశః ఆదినారాయణ రెడ్డితో బాటు మరికొందరు వైకాపా ఎమ్మెల్యేలు కూడా తెదేపాలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారేమోనని అందరూ భావించారు.
ఈ వార్తలను చూసి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు కూడా అప్రమత్తమయ్యారు. సదరు ఎమ్మెల్యేలందరితో జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడిన తరువాత వారికి అటువంటి ఆలోచన ఏదీ లేదనే సంగతి తెలుసుకొన్నారు. ఆయన ఆదేశం మేరకు జిల్లాకు చెందిన 11మంది వైకాపా ఎమ్మెల్యేలలో ఒక్క ఆది నారాయణ రెడ్డి తప్ప మిగిలిన అందరూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వార్తలను ఖండించారు. జిల్లా అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయని తెదేపాలో చేరుతామని ఏవిధంగా ఊహించుకొన్నారో అని ఎద్దేవా చేసారు. తమ పార్టీని దెబ్బ తీసేందుకు తెదేపా మైండ్ గేమ్ ఆడుతోందని వారు ఆరోపించారు. తామందరం వైకాపాలోనే కొనసాగుతున్నామని, పార్టీ మారే ఆలోచన ఎవరికీ లేదని ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో వైకాపా ఎమ్మెల్యేలు- అఖిల ప్రియ, మణిగాంధీ, గౌరు చరితా రెడ్డి, సాయిప్రసాదరెడ్డి, ఎస్.వి మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, రాజేంద్రనాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ఐజయ్య, జయరామ్ పాల్గొన్నారు.
ఆదినారాయణ రెడ్డి ప్రకటనను ఆధారంగా చేసుకొని వైకాపా ఎమ్మెల్యేల అనుమానాలు రేకెత్తించి వారిలో కొందరిని తమ వైపు తిప్పుకోవాలని తెదేపా ఈ ఆలోచన చేసినట్లుంది. కానీ వైకాపా ఎమ్మెల్యేలందరూ ఇలాగ కలిసికట్టుగా మీడియా సమావేశం పెట్టి ఖండించడంతో తెదేపా ఆలోచన బెడిసికొట్టినట్లయింది. అయినా తెదేపాలో చేరడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించిన ఆదినారాయణ రెడ్డినే ఇంతవరకు పార్టీలో చేర్చుకొనే పరిస్థితులున్నప్పుడు, ఇంకా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు చేరబోతున్నారని ప్రచారం చేసుకోవడం ఎందుకో?ఒకవేళ వారు ఐదుగురు నిజంగానే తెదేపాలో చేరేందుకు సిద్దపడితే అప్పుడు కూడా రామసుబ్బారెడ్డి ఆయన అనుచరులు వారి చేరికను వ్యతిరేకించారనే నమ్మకం ఏమిటి? అని ఆలోచిస్తే తెదేపా వ్యూహం ఎంత అసంబద్దంగా ఉందో అర్ధం అవుతుంది. ఒకవేళ మీడియాలో వచ్చిన ఆ వార్తలతో తమకు సంబంధం లేనట్లయితే తెదేపా నేతలు తక్షణమే వాటిని ఖండించి ఉంటే ఇటువంటి అనుమానాలు తలెత్తి ఉండేవే కావు.