బాలకృష్ణ బాల్యమిత్రుడుగా టీడీపీలోకి వచ్చి నేతగా ఎదిగిన కదిరి బాబూరావు.. బాలకృష్ణకు హ్యాండిచ్చారు. నేరుగా వెళ్లి జగన్ సమక్షలో వైసీపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి..ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని ఫీలవుతున్నారు. దర్శిలో.. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుటుంబానిదే పెత్తనం. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన కనిగిరిలో.. మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పట్టు సాధించారు. దాంతో కదిరి బాబూరావుకు ఉక్కపోత ప్రారంభమయింది. ఇక తనకు టీడీపీలో ఏ నియోజకవర్గమూ దక్కదనుకున్నారేమో కానీ.. నేరుగా వెళ్లి వైసీపీలో చేరిపోయారు.
స్థానిక ఎన్నికల కారణంగా ఎవరొచ్చినా కండువా కప్పేస్తున్న వైసీపీ నాయకత్వం కదిరి బాబూరావునూ ఆహ్వానించింది. నిజానికి కదిరి బాబూరావు… ఎవరో గతంలో టీడీపీ నేతలకు తెలియదు. ఆయన బాలకృష్ణకు క్లాస్ మేట్. స్నేహితుడు కూడా. ఈ కారణంగానే.. కనిగిరిలో .. 2009 ఎన్నికల్లోనే సీనియర్ నేతలను కాదని.. కదిరి బాబూరావుకు బాలకృష్ణ టిక్కెట్ ఇప్పించారు. కానీ ఆయనకు నామినేషన్ వేయడం చేత కాలేదు. దాంతో.. కనిగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థికి టీడీపీ మద్దతివ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ బాలకృష్ణ ఒత్తిడితో మళ్లీ 2014లో కనిగిరిలో బాబూరావుకు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు.
అప్పుడు విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయన పరిస్థితి బాగో లేదని తేలడంతో.. ఉగ్రనరసింహారెడ్డిని పార్టీలో చేర్చుకుని చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. బాలకృష్ణ ఫీల్ అవకూడదని అనుకున్నారేమో కానీ.. దర్శి టికెట్ కేటాయించారు. మంత్రి శిద్దా రాఘవరావును ఎంపీగా పోటీ చేయించారు. ఇప్పుడు… కదిరి బాబూరావు బాలకృష్ణకు ఓ మాట చెప్పారో లేదో కానీ.. వెళ్లి వైసీపీలో చేరిపోయారు. ఆయనకు జగన్.. ఏ పదవి హామీ ఇచ్చారో క్లారిటీ లేదు.