వేర్వేరు పార్టీలలో ఉన్నవారే కాదు ఒకే పార్టీలో ఉన్నవారు కూడా కీచులాడుకోవడం బద్ధ శత్రువులు వలే వ్యవహరిస్తుండటం అందరూ చూస్తున్నదే. అటువంటప్పుడు పార్టీలో తమ బద్ధ శత్రువు వేరే పార్టీలోకి వెళ్ళిపోతే అప్పుడు వారు తనివితీరా ఒకరినొకరు తిట్టుకొనే అవకాశం లభిస్తుంది. తెదేపాలో కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి ఆ కోవకు చెందినవారే.
కడియం శ్రీహరి వెళ్ళిపోయినా తరువాత మిగిలిన ఇద్దరూ తమలో తాము కీచులాడుకొంటూనే, అదే నోటితో కడియాన్ని కూడా ఓ నాలుగు ముక్కలనేసి నాలిక దురద తీర్చుకొనేవారు. ఇప్పుడు ఎర్రబెల్లి కూడా తెరాసలోకి జంప్ అయిపోయారు కనుక రేవంత్ రెడ్డి ఒక్కరే ఇటు నుండి తిడుతుంటే, అవతల వైపు నుండి కడియం శ్రీహరి, ఎర్రబెల్లి మళ్ళీ ఒక్కచోటికి చేరినందున వాళ్ళిద్దరూ ఒకరినొకరు విమర్శించుకొంటూ మళ్ళీ అదే నోటితో రేవంత్ రెడ్డిని విమర్శించితే అదేమీ వింత కాబోదు.
తెరాసలోకి ఎర్రబెల్లి రాకను కడియం శ్రీహరి బహిరంగంగా వ్యతిరేకించకపోయినా, మనసులో వ్యతిరేకించకమానరు. ఒకవేళ ఎర్రబెల్లి కారణంగానే తన ఉపముఖ్యమంత్రి పదవి ఊడుతుందని తెలిస్తే ఇంకా వ్యతిరేకించవచ్చును. కారణం అదో కాదో తెలియదు గానీ కడియం శ్రీహరిని మంత్రి పదవిలో నుండి తప్పించబోతున్నారని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిప్పులేనిదే పొగరాదు కదా?
అయితే ఆయన వాటిని ఖండిస్తూ చెప్పిన మాటలు కూడా వాటిని ఇంకా బలపరుస్తున్నట్లే ఉన్నాయి. దీనిపై మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ “కేసీఆర్ నన్ను మంత్రివర్గంలో నుండి తప్పిస్తారని నేను అనుకోవడం లేదు. ఆయనే నన్ను ఏరికోరి మంత్రివర్గంలోకి తీసుకొన్న సంగతి మీ అందరికీ తెలుసు. నా వలననే మంత్రివర్గానికి ఒక రూపం ఏర్పడింది. కనుక ఎవరి కోసమో కేసీఆర్ నన్ను మంత్రి పదవి నుండి తప్పిస్తారని నేను అనుకోవడం లేదు,” అని చెప్పారు.
ఒకవేళ ఎర్రబెల్లికో లేదా కొత్తగా పార్టీలో చేరిన వేరెవరికో మంత్రిపదవి ఇచ్చేందుకు కడియం శ్రీహరిని మంత్రివర్గం నుండి తప్పించినట్లయితే అప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి? తెరాసపై అలిగి మళ్ళీ తెదేపాకి వెళ్లిపోతారా? లేకపోతే కేసీఆర్ ఇచ్చిన ఏదో ఒక పదవిలో సర్దుకుపోతారా? దానికి జవాబు కాలమే చెపుతుంది.