ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై తెలంగాణలో అధికార పార్టీ నేతలు రోజుకో మాటాడుతున్నారు. కొందరు అనుకూలంగా మాట్లాడితే, మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తారు..! లోక్ సభలో మద్దతు ఇవ్వబడుతుందని ఓటింగ్ కి ముఖం చాటేస్తారు, రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా మాట్లాడారు. మొత్తానికి, ఏపీ హోదా విషయమై తెరాస అంతగా కంగారుపడాల్సిన పనిలేదు. తాజాగా మంత్రి కడియం శ్రీహరి కూడా ఏపీ హోదాపై స్పందించారు. ఢిల్లీ వెళ్లిన కడియం, కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ను కలుసుకున్నారు. విభజన చట్టప్రకారం తెలంగాణకు రావాల్సిన అంశాల సాధనకై ఆయన ఢిల్లీ వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై తమకు ఎలాంటి వ్యతిరేకతా లేదన్నారు. కానీ, ఏపీకి హోదా ఇచ్చే క్రమంలో తెలంగాణకు నష్టం జరగకుండా, తమకు కూడా స్పెషల్ స్టేటస్ లో పొందుపరిచిన రాయతీలు ఇవ్వాలన్నారు. హోదా ద్వారా ఆంధ్రాకి పన్ను రాయితీల్లాంటివి వస్తే.. తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోయే అవకాశం ఉందన్నారు. అంతేకాదు, తెలంగాణ అభివృద్ధిపై కూడా దెబ్బ పడే అవకాశం ఉంటుందనీ కడియం చెప్పారు. కాబట్టి, ఆంధ్రాకి ఇస్తూనే.. అవే ప్రయోజనాలూ రాయితీలూ తెలంగాణకి ఇవ్వాలన్నారు.
సరే, ఆంధ్రా హోదాకి వారు మద్దతు ఇవ్వడం వరకూ బాగానే ఉంది. ఆంధ్రాకి హోదా ఇవ్వడం వల్ల తామేదో నష్టపోతామని ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంది..? ఇప్పటికే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ. విభజనతో అన్ని రకాలుగా నష్టపోయింది ఆంధ్రా. ఆంధ్రాకి హోదా వస్తే… తెలంగాణ అభివృద్ధిపై దాని ప్రభావం ఎందుకు పడుతుంది..? ఇప్పటికే ఉన్న పరిశ్రమలు తరలిపోతాయన్న ఆందోళన ఎందుకు..?
అంతేకాదు, ఆంధ్రాకి ఇస్తే.. తత్సమాన ప్రయోజనాలు మాకూ ఇవ్వండని మెలికపెడుతూ కేంద్రాన్ని డిమాండ్ చేయడం.. ఓరకంగా ఇబ్బందికరమైన అంశమే అవుతుంది. ఆంధ్రాకి హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయీ, అందుకే వెనకాడుతున్నామన్న వాదనను గతంలో ఓసారి కేంద్రం వినిపించింది. ఇతర రాష్ట్రాల ఒత్తిడిని సాకుగా చూపింది. ఇప్పుడు కూడా తెలంగాణ నుంచి ఇలాంటి డిమాండ్లు వినిపిస్తే కేంద్రానికి పరోక్షంగా కొమ్ములిచ్చినట్టే అవుతుంది. విభజన చట్ట ప్రకారం తెలంగాణకి రావాల్సినవి, కావాల్సినవి కేంద్రాన్ని డిమాండ్ చేసుకోవడాన్ని ఎవ్వరూ తప్పబట్టరు. కానీ, ఆంధ్రాకి ఇచ్చేవే మాకూ ఇవ్వాలంటూ ప్రస్థావించాల్సిన అవసరం ఏముంది..?