భారత రాష్ట్ర సమితి పార్టీ పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలన్న డిమాండ్లు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావించి తెలంగాణ రాష్ట్ర సమితి ని భారత్ రాష్ట్ర సమితి గా మార్చారు కేసీఆర్. అయితే మొత్తానికే మోసం వచ్చింది. పునాదులు కదిలిపోయాయి. తెలంగాణ సెంటిమెంట్ అనే కవచకుండలాలు మాయమైపోయాయి. ఫలితంగా ఓడిపోయి.. ఇప్పుడు ఉనికి సమస్యలో పడాల్సి వచ్చింది. తత్వం బోదపడటంతో.. బీఆర్ఎస్ పెద్దల్లో అంతర్మథనం ప్రారంభమయింది.
ఇప్పుడు బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్గా మార్చాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్లి ఓడిపోయామని.. పార్టీ తిరిగి పూర్వపేరుకు వెళ్లడం ద్వారా ప్రజలకు తిరిగి దగ్గరవ్వాలని భావిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి ఈ ప్రతిపాదనను పార్టీ నేతల ముందు పెట్టారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో కడియం ఈ విషయానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తెలంగాణను తీసేసి భారత్‌ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని, ఒకటిరెండు శాతంమంది ప్రజలు అలా భావించి దూరమై ఉంటారని భావిస్తున్నారు. వారిని తిరిగి ఆకర్షించాలంటే పార్టీ పేరును మార్చడం తప్ప మరోమార్గం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు, ఎక్కువమంది కార్యకర్తలు కూడా అదే అభిప్రాయపడుతున్నట్టు కడియం శ్రీహరి చెప్పినట్లుగా తెలుస్తోంది.
కడియం శ్రీహరి వ్యాఖ్యలపై కేటీఆర్, హరీష్ రావు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కానీ పలువురు క్యాడర్ మాత్రం కడియం చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. కానీ ఇప్పుడు మళ్లీ పార్టీ మార్చడం సాధ్యమేనా అన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది. సాంకేతికంగా పేరు మార్చడానికి పెద్ద ఇబ్బందేం ఉండదని.. తీర్మానం చేసి పంపితే.. ఎన్నికల సంఘం ప్రాసెస్ ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది కానీ ఇలా చేయడం వల్ల నిలకడ లేని రాజకీయ విధానంపై ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతుందని అది ఇంకా మైనస్ అవుతుందన్న అభిప్రాయంతో కొంత మంది ఉన్నారు.