దళిత బంధు పథకంతో దళిత వర్గాలను ఆకట్టుకోవాలనుకుంటున్న కేసీఆర్ .. ఎజెండా ఆధారంగా తాము కూడా ప్రాధాన్య పోస్టులు పట్టాలని ఆ పార్టీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నారు. తమ తమ రాజకీయ తెలివితేటలతో ముందడుగు వేస్తున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిపి ఒకరికి డిప్యూటీ సీఎం.. మరొకరికి మంత్రి పదవి ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. టీఆర్ఎస్ సీనియర్ దళిత నేతల్లో ఆశలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్‌పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి… ఈ విషయంలో ముందడుగు వేశారు. దళిత బంధు పథకం అమలు విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. కడియం వ్యాఖ్యలు సహజంగానే టీఆర్ఎస్లో కలకలం రేపాయి. రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి.
సొంత పార్టీతో పాటు ఇతర పార్టీల్లోని దళిత నేతలను సైతం చేర్చుకుని పదవులు ఇస్తున్న కేసీఆర్ కు సీనియర్ దళిత నేతలు ఇలా సందేశం పంపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత కాలం కేసీఆర్ పట్టించుకోని రసమయి బాలకిషన్‌కు మూడేళ్ల పాటు ఉండేలా పదవి ఇచ్చేశారు. బీజేపీ నుంచి ఆహ్వానించి మరీ దళిత బంధు చైర్మన్‌గా మోత్కుపల్లికి చాన్స్ ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో .. డిప్యూటీ సీఎం స్థాయి నుంచి ఇప్పుడు కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా లేకుండా పోయిన కడియం లాంటి వారికి అసంతృప్తి ఉండటం సహజం. మొదట ఆయన ఎంపీగాఉండేవారు. రాజీనామా చేయించి ఎమ్మెల్సీ చేశారు. తాటికొండ రాజయ్యకు చెక్ పెట్టడానికి డిప్యూటీ సీఎం చేశారు. కానీ ఇప్పుడు ఆ పదవులన్నీ పూర్తయిపోయాయి. గత ఎన్నికల్లో కనీసం టిక్కెట్ కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఇస్తారో లేదో తెలియని పరిస్థితి.
అందుకే కడియం శ్రీహరి… కేసీఆర్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రస్తుత దళిత ఎజెండా వాతావరణాన్ని వాడుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆయన లక్ష్యం మళ్లీ డిప్యూటీ సీఎమ్మేనని టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు… కేసీఆర్ కన్నా ఎక్కువ ప్రాధాన్యత పొందారు. ఇప్పుడు అంత కాకపోయినా తనకు గౌరవంఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి ఎర్రబెల్లికి అందలం ఎక్కించి తనను పక్కన పెట్టారన్న అసంతృప్తి కడియం శ్రీహరిలో ఉందని ఆయన అనుచరులు బహిరంగంగానే చెబుతూ ఉంటారు.