టీఆర్ఎస్లో అంతర్గత రాజకీయాలు రోడ్డున పడుతున్నాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు వలస నేతలు.. పార్టీపై ఆధిపత్యం కోసం మరోసారి రోడ్డెక్కారు. ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ఆ నియోజకవర్గం నుంచి చాలా సార్లు గెలిచి.. ప్రస్తుతం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇద్దరూ పోటీపడి ఆరోపణలు చేసుకుంటున్నారు. టిక్కెట్ కోసం రేసు ప్రారంభం కావడంతో ఎవరూ తగ్గడం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన కడియం శ్రీహరి.. టీడీపీలో ఉన్నప్పుడు స్టేషన్ ఘన్పూర్ ను కంచుకోటగా మల్చుకున్నారు.
వైఎస్ అశీస్సులతో కాంగ్రెస్తో రాజకీయాల్లోకి వచ్చిన తాటికొండ రాజయ్య ఆ కంచుకోటను బద్దలు కొట్టి గెలిచారు. కానీ పరిస్థితులు మారిపోవడంతో ఆయన కూడా టీఆర్ఎస్ పంచన చేశారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య కిస్సాకుర్సీకా నడుస్తోంది. ఎంపీగా గెలిచిన శ్రీహరిని కేసీఆర్ రాజీనామా చేయించి.. తన కేబినెట్లో డిప్యూటీ గా ఉన్న రాజయ్యను బర్తరఫ్ చేయించి మరీ మంత్రి పదవి ఇచ్చారు. అది అయిపోయాక పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో టిక్కెట్ కూడా రాలేదు. కానీ ఇటీవల ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరగగానే ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గం తనకు లేదా తన కుమార్తెకు ఇవ్వాలనిశ శ్రీహరి పట్టుబడుతున్నారు.
తానే పోటీ చేస్తానని రాజయ్య అంటున్నారు. ఇద్దరిలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు. శ్రీహరి అధికారంలో ఉన్నప్పుడు వందల మంది నక్సలైట్లను చంపించాడని రాజయ్య ఆరోపించారు. తన గురించి ఆరోపణలు చేస్తే.. నీ బతుకు మొత్తం బయటపడెతా అప్పుడు తిరగలేవు అని.. కడియం కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదం ఇక్కడితో ఆగేలా లేదని టీఆర్ఎస్ నేతలు డిసైడైపోయారు.