ఆరూరి రమేష్ న ఆపే ప్రయత్నంలో ఓ వైపు గట్టిగా ఆనకట్ట కట్టేసినట్లుగా నేతలంతా ఆరూరి రమేష్ ఇంటికి వెళ్లి బలవంతంగా ఆయనను హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు. అయితే ఇదే సందు అనుకున్నారేమో కానీ.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇటీవలి కాలం వరకూ పార్టీ వ్యవహారాల్లో చాలా చురుకుగా ఉన్న ఆయన .. గత కొద్ది రోజుల నుంచి మౌనం పాటిస్తున్నారు. కీలక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. దీనికి కారణం పార్ట మారే ఆలోచనేనని చెబుతున్నారు.
కడియం శ్రీహరి తెలంగాణ ఉద్యమం ఉపందుకున్న తర్వాత టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. మొదట వరంగల్ ఎంపీగా గెలిచారు. తర్వాత ఆ పదవిని రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎంను చేశారు. 2018లో మళ్లీ టిక్కెట్ ఇవ్వలేదు. అతి కష్టం మీద ఎమ్మెల్సీని రెన్యూవల్ చేశారు. కానీ 2023లో రాజయ్య గెలిచే అవకాశం లేదని భావించి కడియం శ్రీహరికి టిక్కెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు. పార్టీ ఓడిపోయినా ఇతర విషయాల్లో కడియం శ్రీహరి చురుగ్గా ఉంటున్నారు. కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు. కానీ కొద్ది రోజుల నుంచి ఆయన సీన్ లో కనిపించడం లేదు.
బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూండటంతో కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయానికి కడియం వచ్చారని అంటున్నారు. ఆయనతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి చర్చించినట్లుగా చెబుతున్నారు. కుమార్తె కు రాజకీయ భవిష్యత్ కల్పించడానికి కడియం ప్రయత్నిస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో కాంగ్రెస్ కు బలమైన నేత లేకపోవడం వల్ల.. కూడా కడియం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలని చూసిన రాజయ్యను ఇప్పటికీ వరకూ చేర్చుకోలేదు.