సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యంతో ఇటీవల ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆయన దాదాపు మరణపు అంచుల వరకూ వెళ్లారు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగొచ్చారు. తాను క్షేమంగా ఉన్నానని, తన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందని కైకాల సత్యనారాయణ తెలిపారు. తన ఆసుపత్రి ఖర్చుల్ని భరించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కైకాల ఆసుపత్రిలో చేరిన తరువాత…ఆయన ఆసుపత్రి ఖర్చుల్ని భరించడానికి ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. దాదాపు 25 లక్షల వరకూ ఆసుపత్రి బిల్లుని ప్రభుత్వమే భరించినట్టు సమాచారం. అందుకే.. కైకాల జగన్ కి ప్రత్యేకంగా ఓ లేఖ రాసి, తన కృతజ్ఞతలు తెలిపారు. కైకాల అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలవ్వడంతో అభిమానులు ఆందోళన చెందారు. కొన్ని టీవీ, యూట్యూబ్ ఛానళ్లయితే.. కైకాల చనిపోయారంటూ వార్తల్ని ప్రసారం చేశాయి. ఆ తరవాత తమ తొందర పాటుకు నాలిక కరుచుకున్నారు. ఇప్పుడు కైకాల సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడం అభిమానులకు గొప్ప ఊరట కలిగిస్తోంది.