టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకొంది. ప్రముఖ నటుడు నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ (87) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కొవిడ్ సమయంలో.. ఆయన మరణపు అంచుల వరకూ వెళ్లారు. కానీ తిరిగి కోలుకొన్నారు. ఈమధ్య ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించి.. ఈరోజు తెల్లవారుఝామున 4 గంటలకు కన్ను మూశారు. రేపు ఉదయం…. హైదరాబాద్ లోనే సత్యనారాయణ అంత్యక్రియలు జరుగుతాయి.
దాదాపుగా 60 ఏళ్ల నటన ప్రస్థానం కైకాలది. ఈ ప్రయాణంలో 777చిత్రాల్లో నటించారు. ఎలాంటి పాత్రనైనా… మెడను ఒంచి సవారీ చేయడం కైకాలకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే నవరస నటనా సార్వభౌముడు అయ్యాడు. ఎస్వీఆర్ తరవాత… క్యారెక్టర్ ఆర్టిస్టుగా అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొన్న నటుడు… కైకాలనే. రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేశారు. 1996లో మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి… లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తరవాత.. రాజకీయాలకు దూరంగా ఉన్నారు.ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఆయన చివరి చిత్రం. ఆ తరవాత.. ఆయన ఇంటికే పరిమితమయ్యారు. కైకాల మరణం.. చిత్రసీమని ఇప్పుడు విషాదంలో ముంచెత్తింది. ఇటీవలే.. సూపర్ స్టార్ కృష్ణని కోల్పోయిన టాలీవుడ్ కి ఇది మరో ఎదురు దెబ్బ.