కెరీర్లో ఎప్పుడు ప్రయోగాలు చేయాలో, ఎప్పుడు కమర్షియల్ పంథాలో వెళ్లాలో.. కథానాయికలకు బాగా తెలుసు. ఇప్పుడు ఎన్ని ప్రయోగాలు చేసినా, రిస్క్ లేదని తెలిసినప్పుడే… అటు వైపు అడుగులేస్తారు కథానాయికలు. పైగా… పెళ్లయ్యాక ఎలా కనిపించినా, పెద్దగా సమస్యలేం రావు. అందుకే కాజల్ కూడా విభిన్నమైన పాత్రల్ని ఎంచుకునే ధైర్యం చేస్తోంది. పెళ్లయ్యాక.. కాజల్ ఇంకొంచెం స్పీడు పెంచినట్టే కనిపిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో పాటుగా కొన్ని వెబ్ సిరీస్‌లూ ఒప్పుకుంది. ఆచార్యలో చిరు సరసన నటిస్తోన్న కాజల్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నాగ్ తో జోడీ కట్టింది.
అయితే. ఈసినిమాలో కాజల్ పాత్ర రెగ్యులర్ హీరోయిన్ల పాత్రల్లా ఉండదట. ఆమె ఓ రా ఏజెంట్ లా కనిపించబోతోందని సమాచారం. అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా, ఉగ్రవాదులతో సన్నిహితంగా మెలుగుతూ, వాళ్ల సమాచారాన్ని ఇండియన్ ఆర్మీకి అప్పగించే ఓ సాహసనారి పాత్రలో కాజల్ కనిపించబోతోందని సమాచారం. ఈ సినిమాలో నాగ్ తో డ్యూయెట్లు, రొమాన్స్ లాంటివేం ఉండవని, ఇది సీరియస్ గా సాగే క్యారెక్టర్ అని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు మేకింగ్ ఏమిటో `గరుడవేగ`లో అర్థమైంది. అందులోనూ రెగ్యులర్ సినిమాల్లో కనిపించే డ్యూయెట్లు, రొమాంటిక్ సీన్లూ ఏం ఉండవు. అంతకంటే సీరియస్ పంథాలో ఈ సినిమా నడుస్తుందని ఇన్సైడ్ వర్గాల టాక్. ఈ తరహా పాత్ర కాజల్ ఇది వరకెప్పుడూ చేయలేదు. భవిష్యత్తులోనూ చేయదేమో..?