ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ.. తన కెరీర్‌ని తానే నిర్మించుకుంటూ ముందుకు దూసుకుపోతోంది కాజల్. ఓ దశలో కాజల్ పనైపోయింది అనుకున్నవాళ్లు సైతం.. ఇప్పుడు కాజల్ దూకుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలే `నేనే రాజు నేనే మంత్రి`తో యాభై సినిమాల్ని పూర్తి చేసుకున్నకాజల్.. ఇప్పుడు మరింత స్పీడుగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం కాజల్ చేతిలో అరడజను సినిమాలున్నాయి. వాటిలో `కవచం` ఈవారంలోనే విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కాజల్ తో చిట్ చాట్.
* ‘కవచం’ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏమిటి? ఇందులో మీ పాత్ర అంత కొత్తగా ఉంటుందా?
– ప్రతి సినిమాలో మన పాత్ర కొత్తగా ఉండాలనేం లేదు. ఓ సినిమాను ఒప్పుకోవడం వెనుక చాలా కారణాలుంటాయి. `కవచం` కథ నాకు బాగా నచ్చింది. ఇలాంటి జోనర్లో సినిమా ఇంత వరకూ చేయలేదు. పైగా కొత్త దర్శకులతో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమా చూస్తున్నంత సేపూ… సీటు అంచున కూర్చుని సినిమా చూసే అనుభూతి వస్తుంది. తరవాత ఏం జరుగుతుందనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమాలో ట్విస్టులు ఆకట్టుకుంటాయి.
* మరి మీ పాత్రకున్న ప్రాధాన్యం ఏమిటి?
– `కవచం` పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా. అయినా నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఇది హీరో సినిమానే. కానీ చుట్టూ ఉన్న పాత్రలకూ ప్రాధాన్యం ఉంటుంది.
* నేనే రాజు తరవాత రూటు మార్చి ఛాలెంజింగ్ పాత్రల్నీ ఒప్పుకుంటున్నట్టు అనిపిస్తోంది..
-నేను కొత్త పాత్రలు వచ్చినప్పుడు వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని ఆలోచిస్తాను. నా కంఫర్ట్ జోన్లో ఉండి బయటకు వచ్చి చాలెంజింగ్, ఎక్స్పెరిమెంట్స్ రోల్స్ చేయడానికి ఈమధ్యే ఆసక్తి చూపిస్తున్నాను. మరోవైపు దర్శకులు కూడా నా కోసం కొత్త పాత్రల్ని తీసుకొస్తున్నారు.
* నవతరం కథానాయికలకు మీరు గట్టి పోటీనే ఇస్తున్నారు కదా..?
– అందుకు కారణం హార్డ్ వర్క్ మాత్రమే. ప్రతీ సినిమాలోనూ నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటా. ఫలితాలంటారా… అవి మన చేతుల్లో లేవు. మన అంకిత భావం, కష్టపడే స్వభావమే మన స్థానాన్ని నిలబెడతాయి.
* క్వీన్ రీమేక్ విషయాలేంటి?
– `క్వీన్` చిత్రాన్ని హిందీలో ఐదేళ్ల క్రితం చూశాను. అప్పటి నుంచీ దక్షిణాదిన రీమేక్ చేయడానికి చర్చలు జరిగాయి. ఓ సందర్భంలో నాలుగు భాషల్లో నన్నే కథానాయిగా తీసుకుందామనుకున్నారు. తెలుగు, తమిళంలో హీరోయిన్గా చేయమని అడిగారు. ఇప్పుడు తమిళ వెర్షన్ పారిస్ పారిస్‌లో టైటిల్ పాత్రలో నటించాను. నాలుగు భాషల్లో నలుగురు హీరోయిన్స్ చేయడమనేది చాలా గొప్ప విషయం. క్వీన్ లో కంగనా అద్భుతంగా నటించారు. అందం, అమాయకత్వం కలగలిసిన పాత్ర అది.
* భారతీయుడు 2లో మీరే నాయిక అట..
– అవును.. ఈ ఆఫర్ రావడం చాలా ఆనందంగా ఉంది. అంతకు మించి ఈ సినిమా గురించి ఇప్పుడే ఏం చెప్పలేను.
* 2018 ఎలా అనిపించింది?
– నిజం చెప్పాలంటే ఈ ఏడాది ప్రారంభంలో ఆరోగ్యం బాగా ఆపడైంది. మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నా. గ్యాప్ తీసుకుందామనే అనుకున్నాను. చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి బ్రేక్ తీసుకుందామనిపించింది. కానీ అనుకోకుండా ఈ ఏడాది బిజీ ఇయర్‌గా మారింది. బ్రేక్ తీసుకోవడానికి కుదరలేదు.
* బెల్లంకొండ శ్రీనివాస్ పనితీరు ఎలా అనిపించింది?
– ప్రతి విషయం పట్ల చాలా ఆసక్తిగా ఉంటాడు. చాలా హార్డ్‌వర్క్..ఏదో సాధించాలని తపన పడుతుంటాడు. తండ్రి పేరు ఉపయోగించి ఎదగాలనుకోడు. తన కష్టం తాను పడతాడు. తనని తాను నిరూపించుకోవాలన్న కసి ఉంది.
* కెరీర్ పరంగా అన్ని రకాల ఎత్తు పల్లాల్ని అనుభవించారు. మరి నిజ జీవితంలో ఎప్పుడు స్థిరపడతారు?
– 2018లో చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఓ దశలో నాకూ పెళ్లి చేసుకోవాలనిపించింది. అయితే సినిమాలతో బిజీగా ఉన్నాను. పెళ్లి గురించి ఆలోచించేంత సమయం లేదు. నా పెళ్లి గురించి మీడియా చాలా బెంగ పెట్టుకుందేమో అనిపిస్తోంది (నవ్వుతూ). మా ఇంట్లోవాళ్లకంటే మీకే ఆ కంగారు ఎక్కువ కనిపిస్తోంది.