ఖైది నెం 150తో కాజల్ ఇన్నింగ్స్ కి మళ్లీ ఊపొచ్చింది. అంతకు ముందు చాలా డల్ గా సాగిన కాజల్ ప్రయాణం.. ఒక్కసారిగా హైవేపైకి వచ్చేసింది. నేనే రాజు నేనే మంత్రి హిట్ అవ్వడం, అందులో కాజల్ నటనకు మార్కులు పడడం, గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని తేలిపోవడంతో ఆమెకు ఇప్పుడు భలే డిమాండ్ ఏర్పడింది. దాంతో కాజల్ పారితోషికం విషయంలో మరీ బెట్టు చేస్తోందని తెలుస్తోంది. అంతకు ముందు రూ1.కోటి నుంచి 1.25 కోట్ల వరకూ ఉన్న కాజల్ పారితోషికం ఈమధ్యే… కోటిన్నర దాటింది. ఇప్పుడు 1.75 కోట్లకు తగ్గడం లేదని తెలుస్తోంది. స్టార్ హీరో, హీరోయిన్ ఎవరైనా కావొచ్చు… పారితోషికం అడిగినంత ఇవ్వరు. అందులో రిబేట్లు వర్తిస్తుంటాయి. కానీ కాజల్ మాత్రం `బేరాల్లేవు. నచ్చితే చేస్తా.. లేదంటే లేదు.. అడిగినంత ఇవ్వాల్సిందే` అని మొహం మీదే చెప్పేస్తోందట. స్టార్ హీరోల పక్కన నటించే క్యాలిబర్ కాజల్ లాంటి కొద్దిమందికే ఉంది. అందుకే… ఇప్పుడు ఈ డిమాండ్‌ని కాజల్ బాగా క్యాష్ చేసుకొంటోందని సమాచారం. ఈమధ్య ఓ యువ హీరో సినిమా కోసం కాజల్ ని సంప్రదిస్తే.. రెండు కోట్లు డిమాండ్ చేసింది. తాను ఇక ముందూ ఇదే పంథాలో సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఆమధ్య కాజల్ చేతిలో పెద్దగా సినిమాల్లేవు. తెలుగులో ఆమె పూర్తిగా ఖాళీ అయిన నేపథ్యంలో…. పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని భావించింది. అయితే ఇప్పుడు తనకు మళ్లీ డిమాండ్ పెరగడంతో – ఆ పెళ్లి మాటనే వాయిదా వేసేసింది. దీపం ఉండగానే.. ఇల్లు సర్దుకోవాలిగా!!