కొంతమంది చేసేది తక్కువ.. చెప్పుకునేది ఎక్కువ. పావలా సహాయం చేసి.. పది రూపాయల పబ్లిసిటీ ఆశిస్తారు. ఇంకొంతమంది గుట్టు చప్పుడు కాకుండా ఛారిటీలు చేసేస్తుంటారు. కాజల్ రెండోరకం. ‘సోసైటీకి ఏదోటి తిరిగి ఇవ్వాలి’ అని బలంగా నమ్మే వ్యక్తిత్వం కాజల్‌ది. అలానే.. ఇస్తోంది కూడా. కాజల్ అరకులో ఓ స్కూల్ ని కట్టించింది. గత రెండేళ్లుగా ఈ స్కూల్ దిగ్విజయంగా నడుస్తోంది కూడా. కానీ.. కాజల్ ఈ విషయాల్ని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఈసారి.. మాత్రం ఈ స్కూల్ గురించి మనసు విప్పింది. ”అరకు అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ చాలాసార్లు షూటింగ్‌కి వెళ్లా. అక్కడ గిరిజనులతో మాట్లాడా. వాళ్ల పిల్లలకు కనీస విద్య అందండం లేదనిపించింది. అందుకే ఓ స్కూల్ నిర్మించా. అందుకోసం డొనేషన్లు కూడా కలెక్ట్ చేశా. అవన్నీ సరిగ్గా ఉపయోగపడుతున్నాయా, లేదా? అనేది ఎప్పటికప్పుడు గమనిస్తుంటా. నాకున్న బిజీ షెడ్యూళ్ల వల్ల ఆ స్కూల్‌కి వెళ్లడం కుదరడం లేదు. కానీ నా టీమ్ ఎప్పటికప్పుడు వీడియోలు పంపుతుంటుంది. పిల్లలు అక్కా అక్కా అని పిలుస్తుంటే ఆనందంగా ఉంటోంది” అని చెప్పుకొచ్చింది కాజల్.
ఇలాంటి స్కూళ్లని ఇంకా విస్తరించాలని భావిస్తోందట కాజల్. ”మన పిల్లలు కార్పొరేట్ స్కూళ్లలో చదువుతుంటారు. గిరిజన విద్యార్థులకు ఈ స్థాయిలో అవసరం లేదు. కనీసం ప్రాధమిక విద్య అయినా ఇవ్వగలగాలి. ఇంగ్లీష్ కూడా నేర్పుతున్నాం. పాఠాల్ని పాఠాలుగా చెబుతూ… విద్యార్థుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం” అంటూ వివరించింది కాజల్. నిజంగా.. కాజల్ గొప్ప పనే చేస్తోంది కదా..!