కథానాయికగా రెండు మూడేళ్లు నిలదొక్కుకోవడమే కష్టం. అలాంటిది ఏకంగా పుష్కర కాలం పాటు ప్రయాణం చేసింది కాజల్. యాభై చిత్రాల మైలు రాయినీ అందుకొంది. ఈ ప్రయాణంలో స్టార్ హీరోలందరితోనూ నటించింది. ”వాళ్లందరితో మరోసారి నటించాలనివుంది” అంటోందిప్పుడు. కాజల్ కథానాయికగా నటించిన ‘ఎం.ఎల్.ఎ’… ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కాజల్‌తో తెలుగు 360 చేసిన చిట్ చాట్ ఇది…
హాయ్ కాజల్..
హాయ్
కథానాయికగా 50 సినిమాలు చేసేశారు…. టార్గెట్ సెంచరీయేనా?
ఏమోనండీ.. ప్రత్యేకమైన టార్గెట్లేం పెట్టుకోలేదు. అసలు 50 సినిమాలు చేస్తాననే అనుకోలేదు. కానీ… అదృష్టం, దేవుడి ఆశీస్సులు, ప్రేక్షకుల అభిమానం.. ఇవన్నీ నన్ను 50 సినిమాలవైపు నడిపించాయి.
చిత్రసీమలో అడుగుపెట్టేటప్పుడు మీకంటూ ఏమైనా లక్ష్యాలుండేవా?
లేవు. నిజంగా లక్ష్మీ కల్యాణం చేస్తున్నప్పుడు ఈ ఒక్క సినిమా పూర్తయితే చాలు అనుకున్నా. ఆ సినిమా పూర్తి చేసి, నా ఎంబీఏ నేను చదువుకుందామనుకున్నా. కానీ దేవుడు నన్ను సినిమాలవైపు నడిపించాడు.
ఇక సినిమాలు తప్ప మరో జీవితం లేదని ఎప్పుడు అనిపించింది?
నాలుగైదు సినిమాలు చేసేంత వరకూ నా మానశిక పరిస్థితి గందరగోళంగానే ఉండేది. మగధీరతో నాపై నాకు నమ్మకం వచ్చింది. ఇక మన జీవితం సినిమానే అనిపించింది. అప్పటి నుంచి.. కాస్త స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం మొదలెట్టా.
తొలి సినిమా తరవాత మళ్లీ ఇన్నాళ్లకు కల్యాణ్ రామ్‌తో పనిచేశారు.. మీ ఇద్దరిలో ఎలాంటి మార్పు కనిపించింది..?
ఇద్దరం మారాం. మాలో చాలా పరిపక్వత వచ్చింది. నాకైతే లక్ష్మీ కల్యాణం తొలి సినిమా. అప్పటికి నాకు సినిమాల గురించి ఎలాంటి అవగాహన లేదు. కెమెరా ముందు ఎలా నిలబడాలో, డైలాగ్ చెబుతున్నప్పుడు ఎటు వైపు చూడాలో కూడా అర్థం అయ్యేది కాదు. అలాంటి సందర్భంలో కల్యాణ్ రామ్ నాకు అండగా నిలబడ్డారు. చాలా విలువైన సలహాలు ఇచ్చారు. 50 సినిమాలు చేశాక.. కూడా ఆయన నాకు సలహాలు ఇస్తూనే ఉన్నారు. మేం సెట్లో పరస్పరం చర్చించుకుని సీన్లు చేశాం. రెండోసారి ఆయనతో కలసి పనిచేస్తున్నప్పుడు పాత స్నేహితుడ్ని చాలా రోజుల తరవాత కలసి పనిచేసినట్టే అనిపించింది.
ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్. ఇంట్రవెల్ వరకూ నా పాత్ర ఎలా సాగుతుందో, ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. ఆ తరవాతే.. నా పాత్ర పై గౌరవం పెరుగుతుంది.
ఏ పాయింట్ నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నారు?
కథ బాగుంది. అంతర్లీనంగా మంచి సందేశం ఉంది. సందేశం అంటే… అదేదో బలవంతంగా రుద్దేసినట్టు అనిపించదు. ఎంటర్ టైన్ మెంట్ జోడించి మంచి మెజేజ్ ఇచ్చాం. అది అందరికీ నచ్చుతుంది.
50 సినిమాల తరవాత మీ కథల ఎంపికలో మార్పు వచ్చిందా?
ఇంత అనుభవం సంపాదించాను కదా? అందుకే కాస్త ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా. కమర్షియల్ సినిమాలకు నేనేం దూరం కాను. అవి చేయాల్సిందే. ఒప్పుకున్న ప్రతీ సినిమా వెనుక ఓ బలమైన కారణం ఉండాలని నమ్ముతున్నా.
ఇంత వరకూ లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేయలేదు. కారణం ఏమిటి?
లేడీ ఓరియెండెట్ అంటే.. అవన్నీ హారర్, థ్రిల్లర్ సినిమాలే అనుకుంటున్నారు. కానీ ఆ భావన తప్పు. కథలో నాయిక పాత్రకీ ప్రాధాన్యం ఉంటే.. అలాంటి పాత్రల్నీ ఆదృష్టితో చూడాలి. నేనే రాజు నేనే మంత్రిలో నాది అలాంటి పాత్రే.
అ.. సినిమా ఫలితంతో సంతృప్తిగా ఉన్నారా?
నూటికి నూరుశాతం. నా కెరీర్లో ఇలాంటి సినిమా చేయలేదు. కథంతా నాచుట్టూనే తిరుగుతుంది. కానీ నేను పనిచేసింది వారం రోజులే. కానీ.. చాలా కష్టపడ్డా. రోజుకి 18 గంటలు షూటింగ్ చేసేదాన్ని. అ.. ఓ అందమైన అనుభవంగా మిగిలిపోయింది.
బాలీవుడ్లో్ మీ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదనిపిస్తోంది?
మీకు అలా అనిపిస్తోందా..? (నవ్వుతూ) బాలీవుడ్ కథలపై దృష్టి పెడితే…. కాజల్ తెలుగు చిత్రసీమని మర్చిపోయింది అంటారు. అదే….
అక్కడ సినిమాలు చేయకపోతే… అవకాశాలేం రావడం లేదంటారు. నాకొచ్చిన సినిమాల్ని నేను చేసుకుంటూ వెళ్తున్నా. అది తెలుగా? తమిళమా? హిందీనా? అనేది పట్టించుకోవడం లేదు.
హీరోలందరితోనూ కలసి నటించారు? ఇంకా మీ జాబితాలో ఎవరైనా మిగిలిపోయారా?
ఇప్పుడు చేసినవాళ్లందరితోనూ మళ్లీ మళ్లీ… పనిచేయాలని వుంది.. (నవ్వుతూ).. నా కో స్టార్స్ అంతా గొప్పవాళ్లే. నన్ను బాగా చూసుకున్నారు. సినిమా అనేది సమష్టి కృషి అని వాళ్లంతా నమ్మారు. అందుకే స్టార్ హీరోల సినిమాల్లోనూ నాకు మంచి పాత్రలు దక్కాయి.
జనతా గ్యారేజ్ తరవాత.. ఐటెమ్ పాటల అవకాశాలు రాలేదా?
వచ్చాయి.. కానీ సమ్ థింగ్ స్పెషల్ అనిపించలేదు. స్పెషల్ సాంగ్.. ఎప్పుడూ స్పెషల్‌గానే ఉండాలి కదా? అలా అనిపించినప్పుడే అలాంటి
పాటల్ని ఒప్పుకుంటా.