పెళ్లయ్యాక.. హీరోయిన్లు మరీ చూచీగా అయిపోతారు. పద్ధతైన పాత్రలనే ఎంచుకోవాలని చూస్తారు.కాజల్ కూడా అదే బాటలో వెళ్తోంది. గ్లామరెస్ రోల్స్ ని పక్కన పెట్టాలని చూస్తోందట. `మోసగాళ్లు`లో మంచు విష్ణుకి అక్కగా నటించిన కాజల్.. ఇప్పుడు మన్మథుడు నాగార్జునతో జోడీ కట్టబోతోంది. నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ఓ సినిమా చూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా కాజల్ ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కాజల్ సైతం ధృవీకరించింది. నాగార్జునతో తొలిసారి నటిస్తున్నానని, ఇందులో కూడా హుందాగా ఉండే పాత్ర పోషిస్తున్నానని కాజల్ చెప్పేసింది.
”పెళ్లయ్యాక.. నా రూటు మార్చాలనుకున్నా. గ్లామర్ పాత్రల్ని పక్కన పెట్టా. ఇక నుంచి మరింతగా ఆచి తూచి అడుగులేస్తా. ఎక్కువ సినిమాలు చేయాలని లేదు. మంచి పేరున్న పాత్రలనే చేస్తా. వీలైనంత సమయం ఇంట్లో గడుపుతా” అని చెప్పుకొచ్చింది కాజల్. తను నటించిన `మోసగాళ్లు` ఈవారమే విడుదల అవుతోంది.