హైదరాబాద్: ‘సర్దార్’లో పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేదానిపై కొంతకాలంగా నెలకొన్న అస్పష్టత తొలగిపోయింది. కాజల్‌ను నిర్మాతలు బుక్ చేశారు. గబ్బర్‌సింగ్‌కు పార్ట్-2గా వస్తున్న సర్దార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మితమైన సెట్లో షూటింగ్ జరుపుకుంటోంది. పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలకు దేవి సూపర్ హిట్ సంగీతం అందించటంతో సర్దార్ చిత్రానికి సంబంధించి అతనిపై ఎంతో అంచనాలు ఉన్నాయి. మరోవైపు పవన్ నుంచి పూర్తిస్థాయి చిత్రం వచ్చి రెండేళ్ళుకావటంతో(గోపాల గోపాలలో పవన్ ప్రధాన పాత్రధారి కాదు) అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మారటంవలన, జనసేన వలన ఈ ప్రాజెక్ట్ చాలాకాలం స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయింది. ఇటీవలే పట్టాలకెక్కటంతో అభిమానులు ఆనందిస్తున్నారు.
మరోవైపు సర్దార్ చిత్రంతో కాజల్ ఖాతాలోకి మరో పెద్ద ప్రాజెక్ట్ చేరినట్లయింది. ఇటీవల ఎన్టీఆర్ సరసన టెంపర్‌లో నటించిన కాజల్, బ్రహ్మోత్సవంలో మహేష్ పక్కన బుక్ అయ్యింది. మరోవైపు లారెన్స్ తీస్తున్న కాంచన-3 కూడా అంగీకరించింది. మొత్తానికి కాజల్ పని జోరుగానే ఉంది.