రణరంగంలో కాజల్ కథానాయికగా కనిపించింది. కాకపోతే.. కాజల్ పాత్ర చూసి అందరూ పెదవి విరిచారు. ఇంత చిన్న పాత్రని కాజల్ ఎలా ఒప్పుకుంది? ఈ సినిమా ఎందుకు చేసింది? కాజల్‌ని ఎందుకు వాడుకోలేదు? అనే ఎన్నో ప్రశ్నలు. వీటన్నింటికీ శర్వా సమాధానం చెప్పేశాడు. నిజానికి ఈ సినిమా కాజల్ కి లెంగ్తీ క్యారెక్టరే ఇచ్చార్ట. కానీ.. లెంగ్త్ ఇష్యూస్ వల్ల ఆ పాత్రని కుదించేశార్ట. ”చిన్న పాత్ర అయినా కాజల్ చేయడానికి ముందుకొచ్చింది. నిజానికి ఇదేం చిన్న పాత్ర కాదు. పెద్దదే. కానీ లెంగ్త్ వల్ల ఆ పాత్రని కుదించేశాం” అని చెప్పుకొచ్చాడు శర్వా. ఈ సినిమా పాత గ్యాంగ్ స్టర్ చిత్రాలను పోలి ఉందని, కథ విషయంలో శర్వా పట్టించుకోలేదన్న విమర్శలూ వచ్చాయి. వాటిపై శర్వా బదులిచ్చాడు.
”మేం కొత్త కథ చెప్పాలని, సందేశం ఇవ్వాలని అనుకోలేదు. స్క్రీన్ ప్లే నచ్చి ఈ సినిమా చేశాను. ప్రెజెంట్ కొంత, పాస్ట్ కొంత చూపిస్తే వైవిధ్యంగా ఉంటుందనిపించింది. అదే చేశాం. ఈమధ్య కాలంలో ఇంత బెస్ట్ క్వాలిటీ సినిమా చూడలేదని రివ్యూల్లోనూ రాశారు. అదే మాకు పెద్ద కాంప్లిమెంట్. కల్యాణీకి నాకూ మధ్య లవ్ స్టోరీ చాలా బాగా వచ్చింది. ఇంత మంచి లవ్ ట్రాక్ నేనింత వరకూ చూడలేదు. సాధారణంగా నా సినిమా అనగానే ముందు ఏ సెంటర్లు ఫుల్ అవుతాయి. ఆ తరవాత బీ, సీల్లోకి వస్తుంది. కానీ రణరంగం మాత్రం కొత్త అనుభూతి ఇచ్చింది. తొలుత బీ,సీలు ఫుల్స్ అవుతున్నాయి. ఆ తరవాతే.. ఏ సెంటర్లు నిండుతున్నాయి. ఇంత మాస్ పాత్ర కూడా నేనింత వరకూ చేయలేదు. అందుకే తెరపై నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా” అని చెప్పుకొచ్చాడు శర్వా.