తెలంగాణ సీఎం కేసీఆర్ .. దేశ్ కీ నేత రేసును ఎప్పుడో ప్రారంభించారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న ఆయనకు జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలేవీ వర్కవుట్ కాలేదు. ఏళ్ల తరబడి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆయన తెలంగాణ నేతగానే ఉండిపోయారు. దేశ్ కీ నేతగా మారలేకపోయారు. ఇటీవల ఆయన జాతీయ పార్టీని ప్రకటించి దేశవ్యాప్తంగా పర్యటించాలనుకున్నారు. అందు కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి క్షణంలో ఏదీ కలసి రాకపోతూండటంతో వాయిదా వేసుకున్నారు. ముందుగా తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడాన్ని సవాల్‌గా తీసుకుని .. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం తగ్గించారు.
అయితే కేసీఆర్ మాత్రమే కాదు మోదీకి పోటీగా పలువురు నేతలు రేసులో ఉన్నారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, నితీష్ కుమార్ లాంటి వారు ఈ రేసులోకి వస్తున్నారు. వీరిలో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్.. దేశ్ కీ నేత ట్యాగ్ కోసం దేశవ్యాప్త పర్యటనలు ప్రారంభించబోతున్నారు. అందు కోసం ఆయన ఓ నినాదం కూడా రెడీచేసుకున్నారు. ” మేక్ ఇండియా నంబర్ వన్ఠ పేరిట జాతీయస్థాయి ప్రచార కార్యక్రమాన్ని కేజ్రీవాల్ ప్రారంభించారు. ఇదే పేరుతో ఆయన అన్ని రాష్ట్రాల్లో పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరుతున్నారు.
తన పర్యటనలు రాజకీయం కోసం కాదని దేశం కోసం అని కేజ్రీవాల్ చెబుతున్నారు. అందరు రాజకీయ నాయకులు అదే చెబుతారు. కేజ్రీవాల్ కూడా అదే చెబుతున్నారు. ఇతర ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓ సానుకూలత ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి అన్ని రాష్ట్రాల్లోనూ శాఖలు ఉండేలా చూసుకున్నారు. ప్రాంతీయ ముద్రపడలేదు. అందుకే కేజ్రీవాల్ దూకుడుగా వెళ్తూ.. పార్టీని విస్తరించుకోవాలని.. అసలైన దేశ్ కీ నేతగా ఆవిర్భవించాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.