తెలంగాణ రాజకీయాల్లో కాకా అంటే…అందరికీ తెలిసిన ఒకే ఒక్క నేత.. జి.వెంకటస్వామి. కాంగ్రెస్‌లో దశాబ్దాల పాటు ఉండి.. ఆ కాంగ్రెస్ నేతగానే చనిపోయిన దిగ్గజం. అలాంటి కాకా కుమారులు ఇద్దరూ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య అటూ ఇటూ జంపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఇప్పటి వరకూ… పార్టీలు మారారు. ఇప్పుడు అన్న ఒక్కటే… సొంత గూడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి చెన్నూరు టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహంతో ఉన్న వినోద్.. కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖాయమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో అతి త్వరలో అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరనున్నారు. టీఆర్ఎస్లో తనకు కనీస కనీస గౌరవం దక్కలేదనేది వినోద్ వాదన. ఇప్పటికే రాహుల్ కోటరీలో కీలకనేత కొప్పుల రాజు, శర్మిష్ట ముఖర్జీలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నూరు లేదా బెల్లంపల్లి సీటును వినోద్ ఖరారు చేయించుకునే అవకాశం ఉంది.
చెన్నూరు టికెట్ తనకే అని ఆశపడ్డ వినోద్… దాన్ని ఎంపీ సుమన్ ఎగురేసుకుపోవడం తట్టుకోలేకపోతున్నారు. వెంకటస్వామి కొడుకులైన మీకు టికెట్ ఇవ్వక పోవడం అవమానకరమంటూ కేడర్ ఒత్తిడి తెస్తుండటం వివేక్ బ్రదర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు లోక్‌సభ సీట్ ఇవ్వకపోయినా పర్లేదు.. తన అన్నకు చెన్నూరు టికెట్ ఇవ్వాలని వివేక్ కేటీఆర్ ను కోరారు. కానీ కేటీఆర్ పట్టించుకోలేదు. దీంతో వినోద్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. చెన్నూరు నియోజకవర్గంతో వివేక్ బ్రదర్స్ కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది. 2004లో ఇక్కడి నుంచి విజయం సాధించిన వినోద్.. మంత్రిగా కూడా పనిచేశారు.
రాష్ట్ర విభజన తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో వినోద్, వివేక్ టీఆర్ఎస్లో చేరారు. దీంతో వినోద్‌కు చెన్నూరు అసెంబ్లీ టికెట్, వివేక్‌కు పెద్దపల్లి లోక్‌సభ టికెట్ ఇవ్వడం లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ చెన్నూరు టికెట్ సుమన్‌కు కేటాయించారు. సుమన్ పాటి చేయమా.. అని కుటుంబసభ్యులు సైతం వివేక్‌పై ఒత్తిడి పెంచారు. అన్న కోసం లోకసభ టికెట్ త్యాగం చేసేందుకు కూడా వివేక్ సిద్ధమయ్యారనిు. కానీ ప్రయోజనం లేకపోయింది. అయితే వినోద్ కాంగ్రెస్‌లోకి వెళ్లినా.. వివేక్ మాత్రం వేచి చూసే ధోరణితో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను మాత్రం పార్టీ మారేది లేదని అన్నతో పాటు కేడర్‌కు కూడా వివేక్ స్పష్టంగా చెప్పారు. అంటే.. కాకా కుమారులు చెరో పార్టీలో ఉండబోతున్నారన్నమాట.