కాకా వెంకటస్వామి కుమారులు కాంగ్రెస్ లో చేరడం లేదు. చెన్నూరు టిక్కెట్ కోసం..ఢిల్లీకి వెళ్లి మరీ కాంగ్రెస్ హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపినా.. టిక్కెట్ ఖరారు కాలేదు. అసలే పొత్తుల హడావుడిలో.. సతమతమవుతున్న కాంగ్రెస్.. కాకా పెద్ద కుమారుడి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దాంతో ఆయన… టీఆర్ఎస్లోనే ఉండిపోతున్నారు. తన సోదరుడికి చెన్నూర్ టిక్కెట్ కేటాయించక పోవడంపై అలక బూనిన జి.వివేక్ చల్లబడ్డారు. వినోద్‌కు టిక్కెట్ ఇచ్చే విషయమై పునరాలోచన చేయాలని కాకా వర్గం టీఆర్ఎస్ హైకమాండ్‌పై తీవ్ర స్తాయిలో వత్తిడి తెచ్చింది. అవసరమైతే తాను ఎంపీ టిక్కెట్‌ను వదులుకుంటానని, ఆ టిక్కెట్ బాల్క సుమన్‌కు ఇచ్చి చెన్నూర్ టిక్కెట్ వినోద్‌కు ఇవ్వాలని వివేక్ ప్రతిపాదించి నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వినోద్ పార్టీ మారాలని భావించారు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఆ పార్టీ నేతలతో మంతనాలు కూడా జరిపారు.
ఈ తరుణంలో తన సోదరుడు పార్టీ మారితే ఎలా అని వివేక్ ఆలోచించారు. వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి వస్తుందని మథన పడ్డారు. మహాకూటమి పొత్తుల ఖరారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఢిల్లీకి చేరడంతో వినోద్ కూడా అక్కడికి వెళ్లి పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. తనకు చెన్నూర్ లేదా బెల్లంపల్లి టిక్కెట్ ఇస్తే పార్టీలోకి వస్తానని ప్రతిపాదించారు. కానీ అక్కడ సానుకూలత రాలేదు. అయితే టీఆర్ఎస్ వర్గాలు వినోద్‌కు వెంటనే టచ్‌లోకి వెళ్లాయి. దాంతో ఆయన మూడు రోజుల క్రితం ఆయనతో కేటీఆర్ మంతనాలు జరిపారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, ఎమ్మెల్సీ గానీ, మరేదైనా గౌరవ ప్రదమైన కార్పొరేషన్ పదవి ఇస్తామని తన మాటగా కేసీఆర్ చెప్పారని, అభ్యర్థులతో కలిసి పనిచేసి వారి గెలుపునకు సహకరించాలని చెప్పడంతో వినోద్ కుదుటపడ్డారు.
ఆయన టీఆర్ఎస్లోనే కొనసాగనున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో అభ్యర్థుల వెంట ప్రచారం చేస్తున్నారు. దీంతో..టీఆర్ఎస్లో ఓ బలమైన అసంతృప్తి స్వరం సైలెంటయినట్లు అయింది.