వైఎస్ఆర్సీపీ కంగారు పడుతుందో.. లేకపోతే భారీ మెజార్టీ సాధించి తమ పాలకు అదే ఆమోద ముద్ర అని ప్రచారం చేసుకోవాలనుకుంటుందో కానీ ఆత్మకూరులో బలగాన్ని మోహరిస్తోంది. గ్రామ స్థాయిలో ఇంచార్జుల్ని పెట్టి ఓట్లు వేయించుకోవాలనుకుంటోంది. కనీసం లక్ష ఓట్ల మెజార్టీని తెచ్చుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. బలమైన పోటీ ఉన్నా.. అక్కడ వైసీపీకి ఇరవై నుంచి.. ముఫ్ఫై వేల మెజార్టీ వస్తుంది. ఈ సారి గౌతం రెడ్డి చనిపోయిన సానుభూతి ఎలాగూ ఉంటుంది. గౌతంరెడ్డి వివాదాస్పద వ్యక్తి కాదు. మంచితనంగానే అన్ని పార్టీల నేతలతో వ్యవహరిస్తారు. దీంతో సహజంగానే సానుభూతి ఉంటుంది.
ఇతర పార్టీలు కూడా ఉపఎన్నికల్లో పోటీకి దూరమయ్యాయి. బీజేపీ మాత్రం తామున్నామంటూ రంగంలోకి దిగింది. కొంత మంది ఇండిపెండెంట్లూ బరిలోకి దిగుతారు. ఎవర్నీ బుజ్జగించేందుకు సిద్ధంగా లేని మేకపాటి కుటుంబం.. వైసీపీ నేతలు.. పోటీ ఉండాలని కోరుకుంటున్నారు. పోటీ ఉంటేనే తమకు వచ్చే మెజార్టీ గురించి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే.. పద్దతిగా ఓట్లు వేయించుకోకపోతే.. ఓటర్లు రారని అనుకుంటున్నారేమో కానీ… మంత్రుల్ని కూడా ఇంచార్జులుగా పెడుతున్నారు
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కి ఇప్పుడు బాధ్యత ఎక్కువగా ఉంది. మంత్రి రోజాకూ తప్పడం లేదు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలకు గ్రామాలు, మండలాల వారీగా బాధ్యతలిచ్చారు. 10వ తేదీనుంచి ఇన్ చార్జ్ లు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగబోతున్నారు. అయితే పోటీలో అభ్యర్థులేని పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారన్నది అక్కడి ఓటర్లలో నెగెటివ్‌గా వెళ్లే ప్రమాదం ఉంది. దీనిపై వైసీపీ నేతలు ఎవరూ ఆలోచన చేసినట్లుగా లేరు.