వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి చాలా పెద్ద కష్టం వచ్చింది. భయపడేది లేదని నెల్లూరులోనే ఉంటానని సవాల్ చేసిన ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియకుండా దాక్కున్నారు. పొదలకూరులో క్వార్ట్జ్ ను కొల్లగొట్టిన కేసులో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ముందుగా విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం హాజరు కావడం లేదు. వరుసగా నాలుగు రోజుల పాటు ఆయనకు నోటీసులు ఇచ్చారు. నాలుగు నోటీసులకూ స్పందించలేదు.
హైకోర్టులో అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు ప్రయత్నించారు. కానీ అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ ముందస్తు బెయిల్ పై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టుకు అయినా వెళ్లి ముందస్తు బెయిల్ పొందాలని.. అప్పటి వరకూ బయటకు కనిపించకుండా ఉండాలని అనుకుంటున్నారు. ఆయన ఎక్కడ ఉంటున్నారో అత్యంత సన్నిహితులకు తెలుసు. అరెస్టు చేయాలని అనుకోవడం లేదు కాబట్టి పోలీసులు ఆయన విచారణకు సహకరించడం లేదన్న రికార్డు కోసం నోటీసులు జారీ చేస్తున్నారు.
రేపు సుప్రీంకోర్టులో అయినా విచారణకు సహకరించడం లేదని ఇచ్చిన నోటీసుల గురించి చెబితే.. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా దోపిడీ చేసి.. అధికారం పోయాక వాటిపై కేసులు పెడితే.. ప్రతిపక్ష నేతలపై వేధింపులు అని రివర్స్ ఆరోపణలు చేసి .. బయటపడాలనుకునే రాజకీయాన్ని వైసీపీ నేతలు చేస్తున్నారు. వారి దోపిడీకి రాజకీయాన్నే రక్షణ కవచంగా పెట్టుకుంటున్నారు.