కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. ముందస్తు బెయిల్ వస్తే మీడియా ముందుకు వచ్చి కేసులకు భయపడేది లేదని గర్జించాలని కాకాణి అనుకుంటున్నారు. కానీ ఆయన కోరిక మాత్రం నెరవేరడం లేదు. కోర్టుల్లో ఆయన పిటిషన్ పై విచారణ ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతోంది. తాజా విచారణలోనూ సోమవారానికి వాయిదా పడింది.
క్వార్ట్జ్ అక్రమంగా తవ్వుకుపోయిన కేసులో ఆయన నాలుగో నిందితుడిగా ఉన్నారు. ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశారు. కాకాణి నాలుగో నిందితుడు. అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. కేసు నమోదు చేసినట్లుగా తెలిసినప్పుడు కాకాణి ప్రెస్మీట్ పెట్టి తేల్చుకుంటానన్నారు. కానీ అరెస్టు చేస్తారన్న ప్రచారం జరగగానే కనిపించకుండా పోయారు. విచారణకు రావాలని ఇప్పటికి నాలుగైదు సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన వైపు నుంచి స్పందనలేదు.
కాకాణి కేసుల గురించి చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు. ఎప్పటికప్పుడు ముందస్తు బెయిల్ వస్తుందని.. తాను నెల్లూరులో కార్యకర్తలను కలుస్తానని సమాచారం పంపుతున్నారు. తీరా బయటకు రావడం లేదు. కాకాణికి హైకోర్టులో ముందస్తు బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తారని.. అప్పటి వరకూ ఆయన ఆజ్ఞాతంలోనే ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.