జనసేన పోటీ చేస్తున్న రెండు లోక్ సభ స్థానాల్లో కాకినాడ ఒకటి. సామాజిక పరంగా కాపు అభ్యర్థులకు అప్రకటిత రిజర్వేషన్ పాటించే నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గం నుంచి ప్రతీ సారి విన్నర్ మారుతున్నారు కానీ.. రన్నర్ మాత్రం మారడం లేదు. ఆయనే చలమలశెట్టి సునీల్. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతోనే ఎంపీ అయ్యే అవకాశాల్ని కోల్పోయారు. ఇక్కడ ఉన్న ట్విస్టేమిటంటే మూడు సార్లు మూడు భిన్నమైన పార్టీల తరపున పోటీ చేశారు. ఈ సారి మాత్రం వైసీపీ తరపున రెండో సారి పోటీ చేస్తున్నారు.
ఇప్పటికే మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరపున బరిలోకి దిగి మూడు దఫాలు ఓటమి చవిచూసిన సునీల్ ఈసారి గట్టెక్కాలని ఆయన గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎలాగైనా ఈసారి గెలుపొంది తీరాలనే ఆకాంక్షతో పని చేసుకుంటున్నారు. 2014లో తాను పోటీ చేసిన వైసిపి నుంచి రెండోసారి బరిలోకి దిగుతున్నారు. ఒకసారి ఓటమి పాలైన పార్టీ తరపున రెండోసారి పోటీ చేయడం ఇదే మొదటిసారి కావడంతో ఈ ఎన్నికల్లో అవకాశాలు కలిసి వస్తాయని ఆయన అనుచరులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సానుభూతి కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు. మూడు ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతోనే ఓడిపోయారు.
కాకినాడ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, జగ్గంపేట స్థానాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికిప్పుడు వైసీపీ బలంగా.. భారీ మెజార్టీ సాధిస్తుంది అని చెప్పగలిగే నియోజకవర్గం లేదు. వైసీపీ వేవ్‌లోనే అంతంతమాత్రం మెజార్టీలతో గెలిచారు. పిఠాపురంలో పవన్ పోటీ చేయడం.. జగ్గంపేట, ప్రత్తిపాడుల్లో అభ్యర్థులను మార్చడంతో ఆ నియోజకవర్గాల్లో రాజకీయం మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నా.. టీడీపీకి పని చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్దాపురంలో వైసీపీ వేవ్ లోనూ టీడీపీ గెలిచింది. ఈ అన్ని స్థానాల్లో టీడీపీ, జనసేనకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కలిపితే… వైసీపీకి అసలు ఆశలు ఉండవు. కానీ రాజకీయాల్లో ఎప్పుడూ వన్ ప్లస్ వన్ టు కాదు కాబట్టి.. వైసీపీ ఆశలు నిలుపుకుంటోంది.
ఈ సారి రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉండటానికి కారమం టీడీపీ, జనసేన పొత్తు ప్రభావం గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందన్న అంచనాలే. ఈ కారణంగానే సునీల్‌కు టెన్షన్ తప్పడం లేదు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఆయనకు మైనస్‌గా కనిపిస్తోంది. కొన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసిపి అభ్యర్థులు ఏటికి ఎదురీదుతున్నారన్న అంచనాలు ఉన్నాయి. ఆ వ్యతిరేకతను అధిగమించడం ఎలా అనేది సునీల్ ముందున్న ప్రధాన సవాల్ అనుకోవచ్చు. ఆర్థికంగా బలవంతుడు కావడం ఆయనకు ప్లస్ పాయింట్. అయితే కాపు రాజకీయాలు, పవన్ కల్యాణ్ పై దూషణలు.. తమ వర్గం నుంచి ఓ నాయకుడు ఎదుగుతూంటే… అదే సామాజికవర్గానికి చెందిన వారు భయంకరమైన కుట్రలు చేస్తున్నారన్న అసంతృప్తి కాపుల్లో కనిపిస్తూండటం.. సునీల్ ను ఇబ్బంది పెడుతోంది.
జనసేనకు బలం పొత్తులే. రాజకీయాలకు కొత్త అయిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను పవన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు. అమిత్ షా అడిగితే తానే లోక్ సభ బరిలోకి దిగుతానన్నారు. అయితే ఇప్పటి వరకూ అలాంటి సూచనలు రాలేదు. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు కాబట్టి అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ అవుతారని అనుకోవచ్చు. ఆయన కూడా కాపు సామాజికవర్గమే. జనసేన, టీడీపీ కలిస్తే తిరుగుండదన్న అభిప్రాయంతో పాటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఆయనకు కలసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన రాజకీయాలకు కొత్త.. టీడీపీ నేతలపైనే ఆయన ప్రచార భారం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా ఆయన వెసులుబాటు చూపిస్తే.. అంతా కలిసిపోయి ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓడిపోయే పార్టీ తరపున పోటీ చేయడం సునీల్ హాబీ అనే సెటైర్ ఇప్పటికే కాకినాడలో వినిపిస్తోంది. నాలుగో సారి కూడా ఆయనకు అదృష్టం కలసి రాకపోవచ్చని.. అధికార పార్టీ తరపున పోటీ చేయడం వల్ల సానుభూతి కూడా వచ్చే అవకాశాల్లేవన్న భావన క్రమంగా వ్యాపిస్తోంది. అయితే ప్రచారం ఊపందుకున్నతర్వాతనే… ప్రజాభిప్రాయం బయటకు వచ్చే అవకాశం ఉంది.