ఇళ్ల స్థలాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ మడ అడవుల్ని కూడా కొట్టి పడేస్తోంది అనే ఆరోణలున్నాయి. ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కల్పించే ఈ మడ అడవుల జోలికి వెళ్లడానికి ఎవరికీ అధికారం లేదు. అయినప్పటికీ.. ప్రభుత్వం ఆ భూముల్లో మడ అడవుల్ని కొట్టివేసి చదును చేసి.. ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వ్యవహారం జాతీయ అంశమైపోయింది. సోషల్ మీడియాలో ప్రజల మద్దతు కోసం.. పిటిషన్లు వేసి మరీ.. సామాజిక వేత్తలు పోరాటం చేస్తున్నారు. ఎన్జీటీలోనూ పిటిషన్లు వేశారు. దీంతో మడ అడవుల నరికివేతను నిలిపివేయాలని ఆదేశించింది.
కాకినాడ గురించి తెలిసిన వాళ్లందరికీ.. మడ అడవుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రకృతి పరంగా మడ అడవులు కాకినాడకు వరం. ఇంత వరకూ ఏ ప్రభుత్వం కూడా.. వాటి జోలికి వెళ్లలేదు. వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు. కానీ ఏపీ సర్కార్ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనుకుంది. కానీ భూముల్లేవు. ఆ భూములను మడ అడవుల్లో చూసింది. ఫలితంగా.. మడ అడవులపై కన్నేసింది. సర్వే నంబరు 376, 375/1లో ఉన్న వంద ఎకరాల మడ అడవుల్ని స్వాధీనం చేసుకుంది. మడ అడవులను నరికి, చదును చేసి ఇళ్ల స్థలాలుగా మార్చుతోంది. ప్రభుత్వం తీరుపై మత్స్యకారులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. వీరికి పర్యావరణ వేత్తలు మద్దతుగా నిలిచి.. ఎన్జీటీలో పిటిషన్ వేశారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తక్షణం మడ అడవుల నరికివేతను ఆపాలని ఆదేశించడమే.. కాదు.. ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. గత ఆరు నెలల క్రితం వరకు ఉన్న మడ అడవుల శాటిలైట్ చిత్రాలను పరిశీలించి .. ఎంత మేర అడవుల్ని కొట్టేశారో.. నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎంత మేర మడ అడవులకు నష్టం జరిగింది, మళ్లీ అడవుల పునరుద్ధరణకు ఎంతమేర ఖర్చు అవుతుందనేది కమిటీ నివేదిక ఇవ్వనుంది. అదే సమయంలో హైకోర్టులోనూ పిటిషన్ విచారణలో ఉంది. విశేషం ఏమిటంటే.. ప్రభుత్వం తామ మడ అడవుల్ని నరకలేదని వాదిస్తోంది. తాము ఇళ్ల స్థలాల కోసం స్వాధీనం చేసుకున్నవి మడ అడవులు కాదంటోంది.