ఆంధ్రప్రదేశ్లోని మరో పోర్టు చేతులు మారింది. కాకినాడ పోర్టులు.. అరబిందో రియాల్టీ చేతికి వెళ్లగా… విశాఖలోని గంగవరం పోర్టు అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లింది. ఈ మేరకు 89.6 శాతం వాటాను కొనులోగు చేసినట్లుగా గౌతం అదానీ స్వయంగా ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ గంగవరం పోర్టులో వీఎస్ రాజు, ఆయన కుటుంబానికి చెందిన 58.1 శాతం వాటా ఉంది. ఈ మొత్తాన్ని.. ప్రైవేటు పోర్టులు, లాజిస్టిక్స్ నిర్వహిస్తున్న సంస్ధ అదానీ గ్రూప్ రూ. 3604 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
అంతకు ముందే… గంగవరం పోర్టులో 31.5 శాతం వాటా ఉన్న వార్బర్గ్ పిన్కస్ నుంచి ఆ మొత్తాన్ని ఆదానీ గ్రూప్ కొనుగోలు చేసింది.అంటే దాదాపు 90 శాతం వాటాను గంగవరం పోర్టులో అదానీ గ్రూప్ కొనుగోలు చేసిందన్నమాట. మిగిలిన పది శాతం ఏపీ ప్రభుత్వ వాటా ఉంటుంది.
ఏపీలోని రెండో అతిపెద్ద నాన్ మేజర్ పోర్టు అయిన గంగవరం పోర్టు వైజాగ్ పోర్టుకు అతి సమీపంలోనే ఉంది. దీని సామర్ధ్యం 64 ఎంఎంటీ. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ పోర్టుపై 2059 వరకూ వాటా దారులకు ఆధిపత్యం ఉంటుంది. ఇది అన్నిరకాల వాతావరణం, లోతైన నీరు వంచి అంశాలతో బహుళార్ధ సాధక ఓడరేవుగా గంగవరం పోర్టుకు పేరుంది. 1,800 ఎకరాల భూమి కూడా పోర్టు సొంతం.
విశాఖపట్నంలోని గంగవరం పోర్టును అదానీ దక్కించుకోవడం మంచిదేనని.. ఏపీ మంత్రి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల గంగవరం పోర్టులోని మెజారిటీ వాటాను పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ పోర్ట్స్ తాజాగా కొనుగోలు చేసింది. పోర్టులో ప్రభుత్వ వాటా మాత్రం కొనసాగుతుందని ఆయన చెబుతున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలో పోర్టులు… పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయి. ఇప్పటికే కృష్ణపట్నం కూడా అదానీ చేతుల్లోకి వెళ్లింది. అరబిందో చేతికి మరిన్ని పోర్టులు వెళ్లాయి.