ఫిల్మ్ మేకింగ్ విషయంలో మలయాళ చిత్రాలు ఎప్పటికప్పుడు కొత్త పాఠాల్ని నేర్పుతూనే ఉంటాయి. వాళ్లకు కాన్సెప్టే హీరో. లొకేషన్లు, స్టార్ డమ్, బడ్జెట్… ఇవన్నీ ఆ తరవాతే. కేవలం ఒకే ఒక్క లొకేషన్ లో సినిమా అంతా నడిపేయగల సామర్థ్యం.. వాళ్లకు ఉంది. `కాలా` అలాంటి సినిమానే. ఈ యేడాది మలయాళంలో విడుదలైన `కాలా` విమర్శకుల ప్రశంసల్ని పొందింది. ఇప్పుడు `ఆహా` వేదికగా తెలుగులో డబ్ అయ్యింది. మరి ఈ సినిమా విశిష్టత ఏమిటి? ఏ విభాగాల్లో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది?
కథలోకి వెళ్తే… ఊరికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో.. ఓ ఇల్లు. తండ్రీ కొడుకులకు అస్సలు పడదు. కొడుకు షాజీ (మూర్) వ్యవసాయం చేయాలనుకుంటాడు. అయితే.. అందులో అప్పుల పాలవుతాడు. ఈ విషయంలో తండ్రి (లాల్)తో ఎప్పుడూ గొడవలే. వాళ్లతోటలో పని చేయడానికి వేరే ఊరు నుంచి కొంతమంది పని మనుషులు వస్తారు. వాళ్లలో ఒకడు (టొవినో థామస్). తనో సైకో. ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. తను…ఆ ఇంటికి వచ్చింది పని చేయడానికి కాదు. ప్రతీకారం తీర్చుకోవడానికి. ఆ ప్రతీకారం ఏమిటి? షాజీకీ ఆ సైకోకీ మధ్య ఏం జరిగింది? అనేది తెరపై చూడాలి.
రెండు గంటల సినిమా ఇది. ఆ రెండు గంటలూ ఒకే లొకేషన్లో నడుస్తుంది. ఆ పరిధి దాటి… కెమెరా ఎక్కడికీ వెళ్లదు. కథని ప్రారంభించిన విధానంలోనే ఓ కొత్త తరహా సినిమా చూస్తున్నం అనే సంకేతాలు దర్శకుడు ఇచ్చేశాడు. షాజీ ఇంటి వ్యవహారాలు, తన భార్యతో రొమాన్స్, కుక్కతో ఆడుకోవడం, తండ్రితో గొడవ.. తొలి సన్నివేశాలన్నీ ఇలానే సాగుతాయి. ప్రతీ పాత్రా… అనుమానాస్పదనంగా చూస్తుంటుంది. `ఆ తరవాత ఏదో జరగబోతోంది` అనేదానికి సంకేతంలా. అయితే… అసలు కథలోకి వెళ్లడానికి సగం సినిమా తినేశాడు దర్శకుడు. డిటైలింగ్ పేరుతో చాలా సన్నివేశాల్ని లాగ్ చేశాడు. డిటైలింగ్ అవసరమే. కానీ.. మరీ ఈ స్థాయిలో కాదు. సైకో పాత్ర ప్రవేశం.. తన ఫ్లాష్ బ్యాక్ తో అసలు విషయం అర్థం అవుతుంది. అక్కడి నుంచి కథంతా షాజీ – సైకోల చుట్టూనే తిరుగుతుంది. ఒకర్నొకరు వెంబడించుకోవడం, కొట్టుకోవం, రక్త పాతం సృష్టించుకోవడం ఇదే తంతు. సినిమా సగం నుంచి.. చివరి వరకూ షాజీ – సైకోలు కొట్టుకుంటూనే ఉంటారు. ఆ ఫైట్లేవీ మన తెలుగు సినిమాల్లో ఉండే కమర్షియల్ ఫైట్లు కావు. రియలిస్టిక్ ఫైట్లు. అవి చూస్తుంటే.. మన కళ్ల ముందు ఇద్దరు వికృతంగా కొట్టుకుంటున్నట్టే ఉంటుంది. ఆ దాడుల్లో రక్తపాతం ఎక్కువ. ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలంటే ఇబ్బందే. కాకపోతే… వాటిని వాస్తవానికి అత్యంత దగ్గరగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
కథని క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. ఓ కుక్క చావుకి ప్రతీకారం తీర్చుకునే సైకో కథ ఇది. వినడానికి ఇది నిజంగా విచిత్రంగానే ఉంటుంది. కానీ వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించామని దర్శకుడు చెప్పేశాడు. దాంతో.. సమాజంలో ఇలాక్కూడా జరుగుతుందా? అని ఆశ్చర్యపోతాం. ఎడిటింగ్ కట్లూ, నేపథ్య సంగీత, నటీనటుల నటన.. వీటిలో దేనికీ వంక పెట్టలేం. సైకో ఇలాఉంటాడా? అనే రీతిలో… ఆ పాత్రలో నటించేశాడు థామస్. మూర్ కూడా ఓ రకంగా సైకోలానే ఉంటాడు. పతాక సన్నివేశాలు, అక్కడ వినిపించే.. ఓ వెస్ట్రన్ గీతం ఇవన్నీ చూస్తే దర్శకుడి అభివ్యక్తి, అభిరుచులు అర్థం అవుతాయి. కాకపోతే… కొన్ని విషయాల్లో చాలా చాదస్తంగా అనిపించాడు. అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకుని, ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టాడు. ద్వితీయార్థం ఉత్కంఠతగా సాగినా… అదీ కొన్ని వర్గాలకే నచ్చుతుంది. రియలిస్టిక్ యాక్షన్ సినిమాని ఇష్టపడేవాళ్లకు.. ఓకే. మిగిలిన వాళ్లు ఈ సినిమా కి దూరంగా ఉండడమే మంచిది.
ఒకే లొకేషన్ లో సినిమా ఎలా తీయాలి? అనేది తెలుసుకోవాలంటే.. కాలా చూడొచ్చు. రియలిస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలోని ప్రత్యేకత. అంతకు మించి ఏమీ ఉండదు.