తెలుగుదేశం,వైఎస్ఆర్సిపిల మధ్య నిత్య రాజకీయ రభస తెలుగు వాళ్లకు అలవాటై పోయింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంలో ఇది అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఆయన విదేశాల్లో వుండగానే ప్రతిపక్ష నేత జగన్ ప్రధాని మోడీని కలిసి హౌదా తదితర అంశాలు చర్చించడంతో పాటు రాజకీయ సానుకూలత కూడా ప్రదర్శించుకున్నారు. దీనిపై మీరు కాళ్టు పట్టుకున్నారంటే మీరు లొంగిపోయారంటూ ఉభయులూ తిట్టిపోసుకుంటున్నారు. మంత్రి నక్కా ఆనందబాబు అయితే అసలు కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్న వేస్తున్నారు. ఎపి తెలుగుదేశం అద్యక్షుడు కళా వెంకట్రావు దీనిపై సందేహాలతో జగన్కు ఏకంగా లేఖ రాసేశారు! దీనంతటినీ విలాసంగా చూస్తున్న బిజెపి నాయకులు బ్రహ్మానంద భరితులవుతున్నారు. అందులోనూ టిడిపి విమర్శకుడుగా పేరుపొందిన సోము వీర్రాజు వైసీపీని ఏమీ అనకుండా పాలకపక్షంపైనే విరుచుకుపడ్డారు. మీరు ప్రధానినే అవమానిస్తున్నారని ఆరోపించారు. పొత్తు కొనసాగుతుందా లేదా అనేది టిడిపి ధోరణిపై ఆధారపడి వుంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జగన్పేరుపై గెలిచిన వారిని మీరెలా మంత్రులుగా చేర్చుకున్నారని నిలదీశారు. మొత్తంపైన జగన్ మోడీ భేటిని సిపిఎం తీవ్రంగా విమర్శించినా అంతకంటే టిడిపి విమర్శలకే బిజెపి అధికంగా స్పందించడం ఆసక్తికరం. ఈ లోగా చంద్రబాబు ఢిల్లీలో కొన్ని గంటలపాలు రహస్య పర్యటనలో వున్నారని ఏవో మంతనాలు జరిపి వస్తున్నారని వైసీపీ దుమారం లేవదీసింది.
ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ ఘర్షణలో భాగమనుకోవచ్చు, కాని ఎన్నికల సంఘం ఈవీఎంలపై నిర్వహించిన అఖిలపక్ష సదస్సులోనూ రెండు పార్టీలు పూర్తి భిన్నమైన వాదన చేశాయి. ఈ యంత్రాలపై అనుమానాలను వైసీపీ కొట్టివేసింది. కాని టిడిపి ప్రతినిధులు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తూ బ్యాలెట్ పత్రాలకు తిరిగివెళ్లడం మంచిదని వాదించారు. పరస్పరం ప్రభుత్వాలలో భాగం పంచుకుంటున్న టిడిపి వ్యతిరేకంగా మాట్లాడితే వైసీపీ బలపర్చడం వింతగానే వుంది. గతంలోనూ టిడిపి ఈవీఎంలపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేయడం, ఆ క్రమంలో ఆ పార్టీ కార్యకర్త ఒకరు కోర్టు శిక్షకు గురి కావడం తెలిసిన విషయాలే. కనుక టిడిపి పాత విధానానికే కట్టుబడి వుందనుకున్నా బాహాటంగా వ్యతిరేకించడం మాత్రం ఒకింత వింతగొల్పింది. ఇది ఒక విధంగా టిడిపి ఆత్మ విశ్వాసలోపాన్ని , బిజెపిపై అవిశ్వాసాన్ని సూచిస్తుందా అని పరిశీలకులు ఫ్రశ్నిస్తున్నారు.ఏమైనా ఓటరు ఎవరికి ఓటు వేసింది చూపించే కాగితాలు తెరపై కనిపించి కొద్ది సెకన్లలో బుట్టలో పడిపోయేలా ఎన్నికల కమిషన్ తీసుకున్నచర్యను అందరూ స్వాగతించారు. తెలంగాణ పాలకఫక్షమైన టిఆర్ఎస్,సిపిఎం లు కూడా స్వాగతించాయి.తమ యంత్రాలలో లోపాలు చూపవలసిందిగా సవాలు చేసి సమావేశం వాయిదా వేసిన ఎన్నికల సంఘంపై ఆప్ మాత్రం మండిపడుతున్నది.